వెల్ కమ్ 2022

ఆర్ఆర్ఆర్..రాధేశ్యామ్..భీమ్లా నాయక్..ఆచార్య, సర్కారు వారిపాట, ఖిలాడీ, అంటే సుందరానికి,  థాంక్యూ. ఏజెంట్, భోళా శంకర్, లైగర్, హరి హర వీరమల్లు, సలార్, ఒకటా రెండా ఎన్ని ఎదురుచూపులు. సినిమాల ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ అందరూ…

ఆర్ఆర్ఆర్..రాధేశ్యామ్..భీమ్లా నాయక్..ఆచార్య, సర్కారు వారిపాట, ఖిలాడీ, అంటే సుందరానికి,  థాంక్యూ. ఏజెంట్, భోళా శంకర్, లైగర్, హరి హర వీరమల్లు, సలార్, ఒకటా రెండా ఎన్ని ఎదురుచూపులు. సినిమాల ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు. ఇంకా ఈ జాబితా పెద్దదే వుంది. కానీ వీలయినంత త్వరగా, 2022 లోనే పక్కాగా విడుదలై తీరుతాయనే సినిమాల జాబితా ఇది. 

ప్రతి సినిమా మీద ఓ అంచనా. ప్రతి సినిమా ఓ క్రేజీ కాంబినేషన్. ప్రతి సినిమా ఆ హీరోలకు, డైరక్టర్లకు, బ్యానర్లకు ప్రతిష్టాత్మకమే. 2021 సినిమా జనాల ఆశలు చిదిపేసింది. సినిమా పరిశ్రమను అయోమయంలోకి నెట్టేసింది. కానీ అదే 2021లో ప్రారంభమైనన్ని సినిమాలు గతంలో లేవు. టాప్ టు బాటమ్ ప్రతి హీరో వీర బిజీనే. వన్ టు 100 ప్రతి డైరక్టర్ చేతిలో సినిమా. చిన్న, పెద్ద ప్రతి నటుడు ఫుల్ హ్యాపీ. కానీ అదే సమయంలో ఎగ్జిబిటర్ల, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దిగాలు పడ్డారు. ఇండస్ట్రీ ఓకె కానీ ఫ్యూచర్ ఎలా వుంటుందో తెలియదు. రకరకాల సమస్యలు, ఈక్వేషన్లు, 

మరోపక్కన 2021 సినిమా ప్రేక్షకులకు ఓటిటి ప్లాట్ ఫారమ్ ను దగ్గర చేసింది. నిజానికి సిటీల నుంచి పట్టణాలకు, చిన్న ఊళ్లకు ఓటిటి 2021 లో బాగా పరిచయం అయింది. దాదాపు అరడజను ఓటిటి సంస్థలు ఇప్పుడు తెలుగు లోగిళ్లలోకి దూసుకు వచ్చాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ కలిసి ఎలాలేదన్నా కనీసం కోటి మంది అయినా ఓటిటి సభ్యత్వాలు కలిగి వున్నారు.ఇది చిన్న అంకె కాదు. హాట్ స్టార్, అమెజాన్, ఆహా వంటివి అందరికీ పరిచయం అయిన ఓటిటి సంస్థలు అయిపోయాయి. నెట్ ఫ్లిక్స్ క్లాస్ రేంజ్ నుంచి మాస్ రేంజ్ కు మారుతోంది. 

డిజిటల్ రంగానికి అలవాటు పడడానికి సినిమా రంగం వెనుకాడడం లేదు. సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు రెండు పడవల ప్రయాణానికి అలవాటు పడిపోతున్నారు. ఇదంతా భవిష్యత్ లో సినిమా రంగానికి ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో ఇప్పుడే తెలియదు కానీ టోటల్ గా 2022 అన్నది సినిమారంగ భవిష్యత్ కు నిర్ణయాత్మక పాత్ర వహిస్తుందన్నది వాస్తవం. 

అది అనుకూలంగా, మరింత సానుకూలంగా వుంటుందనే ఆశతో..వెల్ కమ్ 2022