2022, జనవరి 1. మంచి పనితో ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు స్వాగతం పలకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే ఏడాదంతా మంచే జరుగుతుందనే సెంటిమెంట్…ఆ విధమైన ఆలోచనకు మనలో బీజం వేసింది. ప్రజల సెంటిమెంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గౌరవిస్తూ…ఆయన కూడా ప్రజాప్రయోజన పనికి శ్రీకారం చుట్టారు. ఇది ఎంతో అభినందనీయం.
వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద రూ.250 పెంచుతూ జగన్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. తొలి ఏడాది ప్రారంభంలో దీన్ని ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పెంచిన పింఛన్‌తో కలుపుకుని ఇకపై రూ.2,500 పింఛన్ లబ్ధిదారులకు అందనుంది. ఈ పథకం వల్ల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు ప్రయోజనం కలగనుంది.
తాము అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతూ పోతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్ పథకంపై మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలో మొత్తం 62 లక్షల మంది పింఛన్‌దారులున్నారు. వీరికి ప్రయోజనం కలిగిస్తూ ఇవాళ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇదే స్ఫూర్తి రానున్న కాలంలో కూడా జగన్ ప్రభుత్వం కొనసాగించాలి. ప్రజాప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సమాజం కోరుకుంటోంది. ఆ దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేయాలని, వేస్తుందని ఆశిద్దాం.