ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ డిమాండ్లు బీజేపీ మరుగుజ్జు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ పార్టీనా మనల్ని జాతీయ స్థాయిలో పాలిస్తున్నదనే ఆవేదన కలగకుండా ఉండదు. రాజకీయ స్వార్థంతో మతం ప్రాతిపదికన సమాజానాన్ని విడదీసే కుట్రలకు ఏపీ బీజేపీ కుట్రలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ డిమాండ్లపై పౌర సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు మార్చాల్సినవి ఏంటో సమాజం హితవు చెబుతోంది.
గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే తాము అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసినట్టు కూల్చుతామని బీజేపీ నాయకులు సత్యకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి నినాదం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తానెక్కడ వెనక పడతానో అని అప్రమత్తం అయ్యారు. జిన్నా టవర్‌తో పాటు విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి పేర్లను వైసీపీ ప్రభుత్వం మార్చాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కేజీహెచ్‌కు గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాథం పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పుడే ఈ డిమాండ్లు తెరపైకి రావడం వెనుక బీజేపీ రాజకీయ దురుద్దేశాలు ఏంటో ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు. ఏపీ విషయంలో ప్రతిదీ రాష్ట్ర వ్యతిరేక విధానాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో రాజకీయంగా బీజేపీ బలపడే అవకాశమే లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏపీలో పాగా వేసే క్రమంలో బీజేపీ ఏపీ సమాజంతో చెలగాటం ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
నిజంగా ప్రజానీకంపై బీజేపీకి ప్రేమ వుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలని న్యాయ వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. భారతీయులను అణచివేయడానికి బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిందని, పిచ్చివాడి చేతిలో రాయి అయిన ఈ చట్టం ఇంకా అవసరమా? అని జస్టిస్ ఎన్వీ రమణ నిలదీయడాన్ని పౌర సమాజం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ బీజేపీ నేతలకు గుర్తు చేస్తోంది. బ్రిటన్ నుంచి వలస తెచ్చుకున్న రాజద్రోహం చట్టాన్ని రద్దు చేసి, న్యాయపరమైన అంశాల్ని ఎందుకు భారతీయకరణ చేయడం లేదనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.
గాంధీ, తిలక్‌కు వ్యతిరేకంగా బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చిన దేశద్రోహం చట్టాన్ని ఇంకా ఎందుకు కొనసాగించాల్సి వస్తోందే దేశభక్తిపై తమదే పేటెంట్గా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జిన్నాటవర్, విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి అవతరణల వెనుక ఒక చారిత్రక సందర్భం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. వాటి పేర్లు మార్చాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ… ప్రజానీకానికి నష్టం కలిగించే వాటిపై దృష్టి పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. లేదంటే తమనే మారుస్తారని గ్రహిస్తే మంచిదని బీజేపీని పౌర సమాజం హెచ్చరిస్తోంది.