నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయనకు సంబంధించి మొత్తం 16 మందిపై ఢిల్లీలోని సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి సీబీఐ తన ప్రత్యేక ప్రేమను చాటుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని, పనిలో పనిగా సీబీఐపై కూడా ఆరోపణలు చేస్తూ 2021లో రఘురామకృష్ణంరాజు న్యాయపోరాటం చేసినందుకు తగిన ఫలితం దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కష్టపడ్డ వాళ్లకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనేందుకు తాజాగా రఘురామ ఎపిసోడే నిదర్శనమని ఎంపీ అభిమానులు చెబుతున్నారు.
ఆర్థిక సంస్థలు, బ్యాంకులను బురడీ కొట్టించిన కేసులో రఘురామపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటిది జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తున్న రఘురామకు ఇటీవల తెలంగాణ హైకోర్టు గట్టిగా చీవాట్లు పెట్టిన సంగతి తెలి సిందే.
ఇక ప్రస్తుతానికి వస్తే… రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామ కృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు మోసగించిన విధానంపై సీబీఐ ఓ ప్రకటనలో వివరించడం గమనార్హం. ఇకపై తనకు సంబంధించి రఘురామకృష్ణంరాజు ఏ విధంగా న్యాయపోరాటం చేస్తారో చూడాల్సి వుంది.
చెడపకురా చెడెదవు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. జగన్‌పై అక్కసుతో ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలనే రఘురామ ఎత్తులు చిత్తు అయ్యాయి. ముఖ్యమంత్రి బెయిల్ విషయంలో సీబీఐ ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోందంటూ పదేపదే విమర్శలు చేశారు. ఇప్పుడు తన విషయం వచ్చే సరికి ఏమంటారో చూడాలి.