అధికార పార్టీ విధానాలను ఇద్దరు సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. వాళ్లిద్దరూ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే కావడం విశేషం. ఒకరేమో నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మరొకరు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. వైసీపీని విభేదిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణరెడ్డి ఎంతో హూందాగా వ్యవహరిస్తున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం చిల్లరగా ప్రవర్తిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం ఉన్న నేత. ఎప్పుడెలా వ్యవహరించాలో బాగా తెలిసిన నాయకుడని పేరు. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆనం రామనారాయణరెడ్డికి మొదటి నుంచి కోపం ఉంది. రాజకీయ అవసరాల రీత్యా జగన్ పంచన ఆయన చేరారన్నది జగమెరిగిన సత్యం.
ఎన్నడూ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నేరుగా విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. కింది స్థాయి నేతలు, జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో చంద్రబాబుతో ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన డీసెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం అతి మామూలుగా లేదని జనం అనుకుంటున్నారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం కోసమా లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, అసెంబ్లీలో కోటంరెడ్డి వ్యవహరిస్తున్న తీరు అధికార పక్షానికి తీవ్రమైన ఆగ్రహం తెప్పిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోడానికి అవకాశాలు ఇవ్వాలని కోటంరెడ్డి నానా యాగీ చేయడం గమనార్హం. నెల్లూరు రూరల్‌లో ఓ సాధారణ నాయకుడైన కోటంరెడ్డిని జగన్ ఆదరించి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, రెండు సార్లు గెలిపించిన పాపానికి కోటంరెడ్డి బాగానే బుద్ధి చెబుతున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
కోటంరెడ్డి ఎవరి కోసమో వేషాలు వేసినా, వాటన్నింటికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు గట్టి హెచ్చరిక చేస్తున్నారు. రానున్న రోజుల్లో కోటంరెడ్డికి నియోజకవర్గంలో అంత సులువుగా ఉండదనేది వాస్తవం. కోటంరెడ్డి రూపంలో టీడీపీకి పోటీదారుడు దొరకొచ్చేమో గానీ, గెలుపు క్యాండేట్ మాత్రం కాదనేది నెల్లూరు జిల్లా టాక్.