ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సభ పెడితే చాలు ఆయన పొత్తులపైనే మాట్లాడ్తారు. ఎందుకంటే పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్నా, ఇంత వరకూ క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు సాధించడం పక్కన పెడితే, కనీసం అధినేత పవన్‌కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి, ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలవలేని దుస్థితి. దీంతో రాజకీయాలంటే ఆయనకు తత్వం బోధిపడింది.
ఒంటరిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోవడానికి సిద్ధంగా లేనంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారాయన. ప్రయోగాల జోలికి అసలు వెళ్లనంటే వెళ్లనని మొండిగా చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 20 సీట్లే ఇస్తారనే సోషల్ మీడియా ప్రచారాన్ని అసలు నమ్మొద్దని ఆయన వేడుకుంటున్నారు. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని స్పష్టం చేశారు. పొత్తులపై పవన్‌కల్యాణ్ అభిప్రాయాలు ఎలా ఉన్నా, జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం.
ఔనన్నా, కాదన్నా కులపరంగా రాజకీయాలు విభజనయ్యాయి. ఇది కేవలం ఆంధ్రాకే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఎక్కువ, తక్కువను పక్కన పెడితే ఇదే జాడ్యం వుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కమ్మ, వైసీపీపై రెడ్డి, జనసేనపై కాపు ముద్ర ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందరూ తమ వాడే సీఎం కావాలని కోరుకుంటున్నారు. దీన్ని తప్పు పట్టలేం.
అలాగని కులమంతా ఒక పార్టీకే కొమ్ము కాస్తుందని అనుకోలేం. మెజార్టీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. కేవలం రెడ్లో, కమ్మవాళ్లు మాత్రమే మద్దతు ఇస్తే వైసీపీ, టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చి వుండేవి కావు. కానీ అలా వుండదు. తాజాగా టీడీపీ, జనసేన పొత్తుపై ముఖ్యంగా కమ్మ, కాపు, దాని అనుబంధ కుల సంఘాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌ను సీఎంగా చూడాలని కాపుల్లోని మెజార్టీ ప్రజానీకం భావిస్తోంది. అందుకే టీడీపీతో పొత్తు కుదుర్చుకునే పక్షంలో సీఎంగా ఒప్పుకుంటేనే అని పవన్‌కు కాపు కుల పెద్దలు షరతు పెడుతుండడాన్ని గమనించొచ్చు. జనసేనకు 50 సీట్లకు తక్కువగా ఒప్పుకోడానికి కాపు, బలిజ తదితర అనుబంధ కులాలు సిద్ధంగా లేవు. అలాగే జనసేనకు 20-25 సీట్లకు మించి ఇవ్వడానికి కమ్మ సామాజిక వర్గం సిద్ధంగా లేదు. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తే మాత్రం… చంద్రబాబుపై కమ్మ సామాజిక వర్గం దాడి చేయడానికి వెనుకాడలేదు. అది ఎలాంటి దాడి అయినా కావచ్చు.
ఇదే సందర్భంలో 50 సీట్లకు ఒక్క సీటు తక్కువకు ఒప్పుకున్నా జనసేనాని పవన్‌కల్యాణ్‌పై కాపులు దాడి చేయడానికి వెనుకాడరు. చంద్రబాబు పల్లకీ మోయడానికి ఈ దఫా కాపు, బలిజ ప్రజానీకం సిద్ధంగా లేదు. 50 సీట్ల కేంద్రంగా పొత్తు ఆధారపడి వుంటుంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల విషయమై అధికారికంగా పొత్తు ఖరారు కావాలంటే సీట్ల పంపిణీ కీలక పాత్ర పోషించనుంది. పవన్‌కల్యాణ్ తన వరకూ చూసుకుని తన సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాలనుకుంటే, అది టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుంది.
తమను వంచించారనే అక్కసు టీడీపీపై పెంచుకునే ప్రమాదం వుంది. అప్పుడు వైసీపీ కంటే టీడీపీ, ఆ తర్వాత జనసేనను శత్రువుగా కాపులు భావించి, ఎన్నికల్లో తామేంటో సత్తా చూపే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా 50 సీట్లు జనసేకు ఇస్తే బాబును కమ్మోళ్లు, తీసుకోకపోతే పవన్‌ను కాపులు తన్నడం ఖాయమనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ 1 + 1= 2 కాదు కాబట్టే ఈ చర్చ, రచ్చ అని గమనించాలి.