కొత్త ఏడాది అక్కడ నుంచే పాలన… ?

కొత్త ఏడాది వస్తోంది అంటే ఎన్నో కొత్త ఆశలు ఉంటాయి. మరెన్నో ఊహలు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే విశాఖ నగర పాలక సంస్థ మేయర్ జి హరివెంకటకుమారి 2022లో విశాఖకు అంతా మంచే…

కొత్త ఏడాది వస్తోంది అంటే ఎన్నో కొత్త ఆశలు ఉంటాయి. మరెన్నో ఊహలు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే విశాఖ నగర పాలక సంస్థ మేయర్ జి హరివెంకటకుమారి 2022లో విశాఖకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ప్రధమ పౌరురాలిగా ఆమె విశాఖ మేలుని కూడా గట్టిగా కోరుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. కొత్త ఏడాది ప్రజలకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అని అడిగిన మీడియాకు ఇది ఆమె ఇచ్చిన  జవాబుగా చూడాలి. కొత్త ఏడాదిలో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారు అని భావిస్తున్నాను అని మేయర్ చెప్పారు. ఇప్పటికే  విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది మా ప్రభుత్వం అని ఆమె గుర్తు చేశారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఈ ఏడాది చాలా వేగంగా సాగుతుంది అని ఆమె అంటున్నారు.

విశాఖలో జగన్ నివాసం ఉంటారని, ఇక్కడ నుంచే పాలిస్తారని మేయర్ చెప్పడం రాజకీయంగా సంచలనంగా మారింది. మూడు రాజధానుల చట్టాన్నిఈ మధ్యనే అసెంబ్లీలో ప్రభుత్వం ఉప సంహరించుకుంది. అయితే కొత్తగా సమగ్రమైన బిల్లుని ప్రవేశపెడతామని కూడా చెప్పింది. దానికి న్యాయ, సాంకేతిక అంశాలు ఇంకా ఒక కొలిక్కిరావాల్సి ఉంది అంటున్నారు. అయితే జగన్ విశాఖ నుంచే పాలిస్తారు అని మేయర్ చెప్పడం మాత్రం ఆసక్తిగానే ఉంది.

విశాఖను కేంద్రంగా చేసుకుని జగన్ పాలిస్తారు అని ఇప్పటికే మంత్రులు వైసీపీ నేతలు పలుమార్లు చెప్పారు. అయితే గత రెండేళ్లుగా ఇలాంటి ప్రకటనలు ఎన్నో వచ్చినా అడుగు ముందుకు పడలేదు. అయితే కొత్త ఏడాది కాబట్టి అందరికీ ఆశలు ఉంటాయి.

అలాగే విశాఖవాసులకు కూడా రాజధాని కోరిక నెరవేరుతుంది అన్న ఆలోచన కూడా ఉంది. మరి వైసీపీ మేయర్ అయితే 2022లో ఈ ఆశ సాకారం అవుతుంది అని చెప్పడం విశేషం. నిజంగా కొత్త ఏడాది విశాఖలో అలా జరిగేనా, రాజధాని వివాదానికి ఒక తార్కికమైన ముగింపు వచ్చి శుభం కార్డు పడుతుందా అన్నది మేధావుల నుంచి అంతా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.