కుప్పంను కెలికే ధైర్యం చేయలేకపోతున్న బాబు

పార్టీల్లో కట్టప్పల్ని సహించబోనంటూ ఆమధ్య వీరావేశంగా ప్రకటించారు చంద్రబాబు. చెప్పినట్టుగానే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరిపై వేటు వేశారు. మరి అదే పని కుప్పంలో ఎందుకు చేయడం లేదు? Advertisement కుప్పం టీడీపీని…

పార్టీల్లో కట్టప్పల్ని సహించబోనంటూ ఆమధ్య వీరావేశంగా ప్రకటించారు చంద్రబాబు. చెప్పినట్టుగానే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరిపై వేటు వేశారు. మరి అదే పని కుప్పంలో ఎందుకు చేయడం లేదు?

కుప్పం టీడీపీని కెలికే ధైర్యం చేయలేకపోతున్నారు బాబు. కుప్పం టీడీపీలో కీలకంగా ఉన్న మునిరత్నం, మనోహర్ లు దాదాపు బాబును దాటిపోయారు. వాళ్ల బాధ పడలేక చాలామంది వైసీపీలో చేరారు. వీళ్లిద్దరిపై బాబుకు నివేదికలు కూడా అందాయి. కానీ బాబు ధైర్యం చేయలేకపోతున్నారు. కుప్పంలో వేటు వేస్తే మొదటికే చేటు వస్తుందని బాబు భయం. అందుకే నెల్లూరుతోనే ఆయన తన ఆవేశాన్ని ఆపేసుకున్నారు.

వేటు వేసే వరకు వేచి చూస్తారా..?

టీడీపీలో ఉన్న మిగులు జనాల్లో చాలామందికి చంద్రబాబుపై, పార్టీపై నమ్మకం లేదు. తమ దారి తాము చూసుకుందామని అనుకున్నా కూడా ఇది సరైన సమయం కాదని ఆగిపోతున్నారంతా. బయటకి వెళ్లలేక, టీడీపీలో ఉండి భవిష్యత్ నాశనం చేసుకోలేక మధ్యేమార్గంగా సైలెంట్ గా ఉన్నారు. అవకాశం వస్తే వైసీపీకి సపోర్ట్ చేస్తారు కానీ, టీడీపీకి మాత్రం వారు మద్దతు ఇవ్వరు. అందుకే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయాలు దక్కాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు బెట్టు చేసినా, వేటు వేస్తామని హెచ్చరించినా, ఎవరూ టీడీపీలో ఉండే ప్రసక్తే లేదు. అందుకే బాబు భయపడుతున్నారు.

తిరుపతి సెగ్మెంట్ లో కొందరిపై వేటు వేస్తారని, కొందరిని పదవుల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. కుప్పం విషయంలో మాత్రం చంద్రబాబు దీర్ఘాలోచనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు వేటు వేసి ఉన్నవారిని కూడా వదులుకోవడం బాబుకి ఇష్టం లేదు. అందుకే మరో ఏడాది వరకు వేచి చూద్దామని అనుకుంటున్నారు. మరీ పరిస్థితి వికటించితే నియోజకవర్గం మారేందుకు సైతం బాబు సిద్ధంగా ఉన్నారట.

కుప్పంపై వైసీపీ ఫోకస్..

స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని కైవసం చేసుకున్న వైసీపీ.. అదే ఊపులో కుప్పం నియోజకవర్గంపై కూడా ఫోకస్ పెంచింది. చంద్రబాబుని మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. బాబుకి సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టాలా, లేక రాష్ట్రంలో టీడీపీని కాపాడుకోవాలో తేల్చుకోలేని పరిస్థితి. ఈ సందిగ్ధంలో బాబుని నెట్టేసి వైసీపీ గేమ్ మొదలు పెట్టింది. దీంతో చంద్రబాబు అయోమయంలో పడ్డారు. కుప్పం విషయంలో పూర్తి డైలమాతో ఉన్నారు. అందుకే అక్కడ టీడీపీ కట్టప్పల రాజ్యం కొనసాగుతోంది.