పవన్ సత్తా పై అనుమానమా?

చంద్రబాబు కు చాణక్యుడు అని పేరు వుంది. అందరి కన్నా ముందుగా ఆలోచించి ఎత్తులు వేస్తారు అని రాజకీయ జనాలకు అపారమైన నమ్మకం. అందువల్ల చంద్రబాబు ఏం చేస్తున్నా కాస్త జాగ్రత్తగా గమనించాల్సిందే. ప్రస్తుతం…

చంద్రబాబు కు చాణక్యుడు అని పేరు వుంది. అందరి కన్నా ముందుగా ఆలోచించి ఎత్తులు వేస్తారు అని రాజకీయ జనాలకు అపారమైన నమ్మకం. అందువల్ల చంద్రబాబు ఏం చేస్తున్నా కాస్త జాగ్రత్తగా గమనించాల్సిందే. ప్రస్తుతం చంధ్రబాబు ఒకటే ప్రాజెక్టు మీద వున్నారు. 2024లో ఎలా అధికారం సంపాదించడం అన్నదే ఆ ప్రాజెక్టు. జనం ఏమన్నా అనుకోనీ? తనకు బలం లేదనో, లేదా ఒంటరి పోరు సాగించలేననో, ఇంకా..ఇంకా ఏమైనా అనుకోనీ. తనకు అనవసరం. జగన్ నుంచి అధికారం లాక్కోగలిగితే చాలు. ఆ తరువాత ఇక అన్నీ చూసుకోవచ్చు. 

ఈ నేపథ్యంలో ముందుగా ఆయన చేసిన పని భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం. ఆంధ్రకు కేంధ్రం ఏం చేసినా నోరు మెదపకపోవడం. వీలయినంతగా భాజపాను దగ్గర చేసుకోవాలని ప్రయత్నించడం. అందుకోసం తనకు సన్నిహితులైన వారిని కొందరిని భాజపాలోకి పంపించడం. అంతే కాదు. ఎన్నికల ముందు దూరం జరిగిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ను సైతం భాజపాకు దగ్గరయ్యేలా చేసారు.

అంతా బాగానే కానీ, అయినా కూడా కమలనాధులు కనికరించడం లేదు. బాబు దగ్గరలోకి రావడం లేదు. ఒంటరి పోరే సాగిస్తాం అంటున్నారు. అయినా చంద్రబాబు ఆశలు వదలుకోవడం లేదు.  ఆ ప్రయత్నాలు సాగిస్తూనే వున్నారు. ఈ క్రమంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరో పక్క నమ్ముకున్నారు. ఎప్పటికైనా జనసేన-భాజపాలను కుడి ఎడమల వుంచుకుని జగన్ ను ఢీకొనవచ్చు అని ఆయన అనుకుంటూ ఆయన రోజులు గడిపేస్తున్నారు. ఎంత త్వరగా 2024 వస్తుందని ఆశగా చూస్తున్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన బిసిల ఓట్లు జగన్ వైపు వెళ్లిపోయాయి. మళ్లించాలనే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎక్కడెక్కడి బలహీన వర్గాలను వెదికి మరీ పదవులు ఇస్తున్నారు జగన్. అగ్రవర్ణాల అడ్డాలు అనుకున్న చోట కూడా బి సి లకు అవకాశం ఇచ్చారు. అందువల్ల బాబుగారికి మిగిలిన ఆప్షన్ కాపులు మాత్రమే. అందుకే భాజపా వైపు ఆశగా చూస్తూ, పవన్ ను దువ్వుతూ వస్తున్నారు.

కానీ ఇలాంటి నేపథ్యంలో కాపుల ఓట్లకు కూడా జగన్ గండి కొడతారనే భయం ఇప్పుడు కొత్తగా చంద్రబాబులో మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పుడయితే ముద్రగడ పద్మనాభం అందరినీ కలిపే కొత్త రాజకీయం ప్రారంభించే ప్రయత్నం చేసారో, ఎప్పుడయితే వంగవీటి రాధా మళ్లీ వైకాపా గూటికి చేరతారని వార్తలు వినిపించడం ప్రారంభించాయో, చంద్రబాబు భయం పెరగడం ప్రారంభమైంది. 

కేవలం పవన్ కళ్యాణ్ ను నమ్ముకంటే కాపుల ఓట్లు వస్తాయనే గ్యారంటీ కనిపించడం లేదు. అందుకే అర్జంట్ గా గంటా, వంగవీటి, జెడి లక్ష్మీ నారాయణ లాంటి వాళ్ల సమావేశం జరిగినట్లు కనిపిస్తోంది. వీళ్ల సమావేశం వెనుక బాబు వ్యూహం వుందా లేదా అన్నది క్లారిటీ ఇంకా రాలేదు. కానీ వున్నారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. 

కాస్త అటు ఇటు ఊగిన వంగవీటి రాధాను సముదాయించ గలిగారు. ముద్రగడ ఎత్తుగడలకు పోటీగా ఎత్తుగడలు వేయించే ప్రయత్నం ఫ్రారంభించారు. ఇదంతా ఎందుకోసం అనుకోవాలి. కాపుల ఓట్ల కోసం తప్ప. కానీ ఓట్ల కోసమే కదా పవన్ ను దగ్గరగా చేసుకున్నారు. అనధికారికంగానైనా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది ఏమిటి? 2024 నాటికి పవన్-చంద్రబాబు కలిసి పయనిస్తారనే కదా. 

మరి కాపులను తెలుగుదేశం పార్టీ పరంగా దువ్వే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? అంటే పవన్ తెచ్చే ఓట్లు ఆయన తెస్తారు. తాము సంపాదించేవి తాము సంపాదించాలి అనే ఉద్దేశంతోనా?  అటు భాజపా కాపు ఓట్ల కోసమే చూసి, ఇటు పవన్ అదే పని మీద వుండి,  మధ్యలో చంద్రబాబు, జగన్ వర్గాలు కూడా ఎన్నో కొన్ని తీసుకుంటే, కాపుల ఓట్ల ఎన్ని ముక్కలు అవుతాయి?  అప్పుడు ఫలితం ఎలా?

గంటా అండ్ కో చెబుతున్నట్లు, అధికారసాధనే పరమార్థం అంటే మళ్లీ వ్వవహారం తేడా వస్తుంది. ఒక్క జనసేన లేదా భాజపాలో తప్ప ఎక్కడా సిఎమ్ పోస్ట్ కాపులకు వచ్చే అవకాశం లేదు. తెలుగుదేశం, వైకాపాలు కాపులకు సిఎమ్ పోస్ట్ ఇవ్వవు కదా? అలా అని గంటా, జెడి, వంగవీటి వీరంతా భాజపా పంచన చేరడానికి రెడీ అవుతున్నారు అనుకోవాలా? అలా అయితే మళ్లీ చంధ్రబాబుకు సమస్యే. వీళ్లంతా భాజపాలోకి వెళ్లి, భాజపా కూడా చంధ్రబాబుకు దగ్గరైతే తప్ప, ఆయన మళ్లీ సిఎమ్ కావాలనే కలలు నిజం కావడం కష్టం. అప్పుడు కూడా కాపులు అంతా ఇంతటి వ్యూహం పన్ని బాబుగారి పక్కన చేరితే బిసిల విషయంలో మొదటికే మోసం వస్తుంది.

మొత్తం మీద అపర చాణక్యుడు అనుకునే చంద్రబాబు అధికారం అందుకోవాలనుకునే తహ తహలో ఏం చేయాలో తెలియక తలా వైపు తలా అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆయన వ్యూహంలో చిక్కకుని చాలా మంది తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. 2014లో పవన్ కళ్యాణ్ భాజపాకు దగ్గరై, ఆ తరువాత బాబుకు దగ్గరై, ఆ పైన రెండింటికీ దూరమై,  మళ్లీ భాజపాకు దగ్గరై ఇలా రకరకాలుగా మారుతున్నారు. ఇప్పుడు బాబుగారి వ్యూహంలో చిక్కుకుని ఆయనకు దగ్గరై, భాజపాకు దూరమైతే ఇంక క్రెడిబులిటీ ఏముంటుంది. 

అలాగే జెడి లక్ష్మీనారాయణ నే చూడండి. ఆయన మేధావి. యువతరానికి ఆదర్శం. రైతుల సమస్యలపై పోరాడతారు. ఇవన్నీ ఇలా వుంటే ఇప్పుడు కాపుల సమావేశానికి ఆయన కూడా హాజరు. ఆయన కూడా కుల రాజకీయాలకు దిగిపోతే ఇంకేం క్రెడిబులిటీ వుంటుంది. 

కాపుల సమావేశానికి కీలకమై, కాపులకు అధికారసాధన అంటూ పెద్ద కబుర్లు చెప్పిన గంటా శ్రీనివాసరావు చుట్టూ ఎవరు వున్నారో విశాఖ వాసులకు తెలియని సంగతా? ఆయన పేరుకు కాపు సామాజిక వర్గమే కానీ, ఏ సామాజిక వర్గం బంధాలతో రాజకీయంగా ఎదిగారో జనాలకు తెలియదా ?

ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు వీరిని ఎందుకు ముందుకు తోస్తున్నారు? కేవలం పవన్ ఒక్కరి వల్లనే కాపు ఓట్ల సాధన సాధ్యం కాదని చంద్రబాబు భావిస్తున్నారా? లేక అనుమాన పడుతున్నారా? ఎన్నోఅనుమానాలు వున్నాయి. కానీ ఒకటి మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. అధికారం అందడం కోసం చంద్రబాబు అందిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలనుకుంటున్నారు. లేదా కొత్త అవకాశాలు సృష్టించుకోవాలని అనుకుంటున్నారు. అందులో ఒకదానితో ఒకటి పొసగని ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. అవి వికటిస్తాయో? సహరిస్తాయో అని మాత్రం ఆయన ఆలోచిస్తున్నట్లే కనిపించడం లేదు.