మళ్ళీ అదే తప్పు చేయొద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆ పార్టీ తమ్ముళ్లు అంటే కార్యకర్తలు, నాయకులు హెచ్చరిస్తున్నారట. ఏం తప్పు చేయొద్దంటున్నారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలంటే టీడీపీకి పొత్తులు తప్పనిసరి. టీడీపీకి ఒంటరిగా వైసీపీని ఓడించే సత్తా లేదు. ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వైసీపీని ఓడించవచ్చో టీడీపీ ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలో రరకాల కూడికలు తీసివేతలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మోడీనిగానీ, బీజేపీని గానీ ఆయన విమర్శించడంలేదు. ఇక బీజేపీ- జనసేన బంధం కూడా క్రమంగా సడలిపోతోంది. అది చాలాసార్లు రుజువైంది కూడా.
ఈ క్రమంలోనే జనసేనతో కూడా పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధమవుతుందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే పార్టీకి ప్లస్ అవుతుందనే కోణంలో టీడీపీ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగింది. అటు జనసేన గెలవలేదు..ఇటు టీడీపీ గెలవలేదు. మధ్యలో వైసీపీకి ప్లస్ అయింది.
ఈ సారి మాత్రం వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటే టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుని బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా వీరితో కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ మొన్నీమధ్య నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ టీడీపీని తీవ్రంగా విమర్శించారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్నుట్లుగా మాట్లాడారు.
అయితే టీడీపీతో బీజేపీ కలవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. అదే సమయంలో ఏపీకి బీజేపీ చేసింది ఏమి లేదు. ఏపీ ప్రజలు బీజేపీపై బాగా ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీపై ఉన్న నెగిటివ్ టీడీపీపై పడే అవకాశం ఉంది. అన్నిటికీమించి క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదు. కాబట్టి బీజేపీతో కలవకపోవడమే మంచిదని అంటున్నారు.
అసలు బీజేపీ కంటే కమ్యూనిస్టులే బెటర్ అని తమ్ముళ్ళు భావిస్తున్నారు. కమ్యూనిస్టులకు ఏజెన్సీ నియోజకవర్గాల్లో గానీ, కొన్ని ప్రాంతాల్లో మంచి ఓటింగ్ ఉందని, కాబట్టి కమ్యూనిస్టులని కలుపుకునే వెళితే బెటర్ అని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీని దూరం పెడితేనే బెటర్ అంటున్నారు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉందనే పేరు తప్ప ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీతో కలిస్తే టీడీపీకే డ్యామేజ్ అంటున్నారు.
జనసేన, కమ్యూనిస్టులని కలుపుకుని వెళితే ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మరి ఎన్నికలు దగ్గర పడేనాటికి అధినేత చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.