ఎన్నికల నుంచి ఎన్నికలు. ఇదే నేటి రాజకీయం. ఓడిపోయిన వారు అయిదేళ్ళూ ప్రజలకు సేవ చేసి వారి సమస్యల సాధనకు కృషి చేసి మెప్పు పొందాలని తపించడం అంతా గతం. తాము ఓడిపోతే వెంటనే ఎన్నికలు రావాలని విపక్షలు చూడడం నయా పాలిటిక్స్.
టీడీపీలో అయితే ఎపుడెపుడు ఎన్నికలు పెడతారా అన్న ఆత్రం 2019 నుంచి కనిపిస్తూనే ఉంది. అలా చూస్తూండగానే భారంగా రెండున్నారేళ్ల కాలం గడచిపోయింది. దాంతో కొత్త ఏడాదిలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. ఇక ఎంతమాత్రం విపక్ష పాత్ర పోషించేది లేదు అన్న ఆలోచన కూడా ఉండి ఉండాలి. అందుకే ఆ పార్టీ నేతల నుంచి సంచలన కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. తాజాగా సిక్కోలులో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సర్వ సభ్య సమావేశంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు సంచలన వ్యాఖ్యలే చేశారు.
ఏపీలో ఎపుడైనా ఎన్నికలు రావచ్చు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన సడెన్ గా క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. దీంతో కలవరపడడం తమ్ముళ్ళ వంతు అయింది. మరి రామ్మోహన్ కి ఎలా వచ్చిందో ఈ ఊహ తెలియదు కానీ ఎన్నికలు ఏ సమయంలో అయినా ఏపీలో జరుగుతాయని జోస్యం చెప్పేశారు.
అంతే కాదు ఈసారి ఎన్నికలు జరిగితే టీడీపీకి కచ్చితంగా 151 సీట్లు లభిస్తాయని కూడా మరో జోస్యం వదిలారు. చూడబోతే ఏపీలో అధికార పార్టీకి ఇంకా సగం సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు 2024 మే లో మాత్రమే జరుగుతాయి. కానీ రామ్మోహన్ మాత్రమే తొందరపడుతున్నారా లేక టీడీపీ మొత్తానికే ఈ ముందస్తు ఎన్నికల కోరిక ఉందా అన్నదే ఇక్కడ చర్చ.
ఏది ఏమైనా ఏపీలో రాక్ష పాలన సాగుతోందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అసలూ వడ్డీ రెండూ చెల్లించి తీరుతామని ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలు వైసీపీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే సీట్లు వస్తాయని కూడా కింజరాపు ఫ్యామిలీ సరికొత్త జోస్యం చెబుతున్నారు.
మొత్తానికి కొత్త ఏడాదిలో మరింత శక్తివంతంగా ప్రజా సమస్యల మీద పోరాడుదామని క్యాడర్ కి దిశా నిర్దేశం చేయాల్సిన టీడీపీ నేతలు ఎన్నికలు వెంటనే పెట్టాలి, తాము అర్జంటుగా అధికారంలోకి రావాలి, వైసీపీని దెబ్బ తీయాలి అని కోరుకోవడమే అసలైన రాజకీయ చిత్రంగా చూడాలేమో. 2021కి వీడ్కోలు పలుకుతూ 2022లో కూడా ఇదే తీరున రాజకీయ రచ్చ చేసేందుకు టీడీపీ రెడీ అన్నదే నేతల మాటల బట్టి అర్ధమవుతోంది అంటున్నారు వైసీపీ నేతలు.