Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: అర్జున ఫల్గుణ

మూవీ రివ్యూ: అర్జున ఫల్గుణ

టైటిల్: అర్జున ఫల్గుణ
రేటింగ్: 1.5/5
తారాగణం: శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజి రాజా, దేవి ప్రసాద్, సుబ్బరాజు తదితరులు
కెమెరా: జగదీష్ చీకటి
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: తేజ మర్రి
విడుదల తేదీ: 31 డిసెంబర్ 2021

2021 లో ఆఖరి సినిమాగా విడుదలయ్యింది "అర్జున ఫల్గుణ". ఏదో విషయమున్న సినిమా అనే అంచనాలు ఏర్పరుచుకునేలా అయితే ఉన్నాయి టైటిల్, ట్రైలర్. 

అసలెలా ఉందో చూస్తే...

శ్రీవిష్ణు విషయమున్న నటుడు. అతని సినిమాల్లో మినిమం గ్యారంటీ కథుంటుంది. ఇప్పటికి దాదాపు ముప్పై పై చిలుకు సినిమాల్లో హీరోగా నటించినా, సరైన బాక్సాఫీస్ హిట్ లేకపోయినా ఈ నటుడుకి అవకాశాలు రావడానికి గల ఏకైక కారణం అతని ట్యాలెంట్. 

కనీ అసలీ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడో, అసలు దర్సకుడు ఏం చెప్పి ఒప్పించాడో అర్థం కాదు. 

ప్రేక్షకులు ఏది చూపిస్తే అది చూసేస్తారనుకోవడం దర్శకుడి ప్రతిభాలోపానికి నిదర్శనం. 

వెళ్లిపోతున్న రైలుని పడిపోయిన వాడు లేచి పరుగెత్తి అందుకోవాలనుకునే సీన్ ఏ కాలం నాటిది? 

రెండు వేల రూపాయల నోట్ల డినామినేషన్లో ఉన్న యాభై లక్షలు మోయడానికి ఏకంగా ఒక గోనసంచి అవసరమా? 

ఈ కనీసపు లాజిక్కులు కూడా పట్టించుకోకుండా సినిమా తీసేయడమంటే అది అమాయకత్వానికి తార్కాణం.

విలేజ్ వాలంటీరు, ప్రెసిడెంట్ మెడల్, కోడి కత్తి అంటూ కరెంట్ అఫైర్స్ ని దృష్టిలో పెట్టుకుని డైలాగులైతే రాసుకున్నారు కానీ ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పారేయడానికి కావల్సిన సరంజామా కథలోనూ, కథనంలోనూ, సంభాషణల్లో కూడా లేదు. 

ప్రేక్షకుల స్థాయి మారింది. దర్శకులు కూడా అప్గ్రేడ్ కావాలి. ఇలాంటి పాతరకం సినిమాలకి థియేటర్స్ లో కాలం చెల్లింది. 

ఇక చాలా సీన్స్ ఊహించినట్టుగానే జరుగుతాయి. ఇందులో హీరో డబ్బు మూటని ఒక చోట దాస్తాడు. అది చూడగానే కొన్ని సన్నివేశాల తర్వాత ఆ డబ్బు ఏమౌతుందో సాధారణ ప్రేక్షకుడు చాలా సులభంగా ఊహిస్తాడు. అనుకన్నట్టే జరిగింది. 

ప్రేక్షకుడు ఊహించనిది తెర మీద నడపడమే స్క్రీన్ ప్లే మాయాజాలం అంటే. అప్పుడే ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాలో ఆ దాఖలాలు లేవు. 

శ్రీవిష్ణు మంచి నటుడు. గోదావరి యాసలో నిష్ణాతుడు. చాలా బాగా చేసాడు. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉందంతే. ఆమె పాత్ర కథపరంగా అయితే పెద్ద అవసరమే లేదు. ఇక నరేష్ గోదావరి యాసలో మాట్లాడడం ఎప్పటికీ నేర్చుకోలేడేమో. ఎప్పటిలాగానే చాలా కృతకంగా ఉంది. దేవీ ప్రసాద్, శివాజిరాజా తమ తమ పరిధుల్లో నటించారు. హీరో ఫ్రెండ్స్ గా నటించినవారు ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో ఉన్నారు. 

సుబ్బరాజు పాత్ర కూడా చాలా ఓల్డ్ మోడల్ లో ఉంది. 

అసలు ఈ సినిమాని కామెడీ యాక్షన్ సెంటిమెంటల్ ఎంటటైనర్ అనుకుని దిగారేమో. 

ఎందుకంటే శ్రీవిష్ణుని మాస్ హీరోగా చూపించాలనే తాపత్రయం కనపడింది. పోనీ అది అతికిందా అంటే అతకలేదు. ఎందుకంటే కథ పరనగా హీరోకి అంత సీన్ లేదు. సరదాగా సాగాల్సిన పాత్ర అది. ఫ్రెండ్స్ కూడా కామెడీ మీదే నిలబడతారా అంటే కాదు. వాళ్లకి కూడా కష్టాలు, కన్నీల్లూ ఉంటాయి. 

ఒకటి రెండు పాటలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ సంగీత సాహిత్యాల్లో కొత్తదనం కొట్టొచ్చినట్టైతే వినపడదు. కెమెరా వర్క్ ఓకే. 

గతంలో "స్వామి రారా", "అనగనగా ఒక రోజు" లాంటి సినిమాలు డబ్బు/క్రైం చుట్టూ తిరుగుతూ సగాయి. అవన్నీ చాలా లైటర్ వేన్ లో సాగుతాయి. బోర్ కొట్టవు. 

కానీ "అర్జున ఫల్గుణ" అలా కాదు. నానా రకాలుగా ఉంటుంది. సంవత్సరాంతంలో ప్రేక్షుల నెత్తిని పిడుగుపాటుతో కొట్టిన చిత్రమిది. 

మామూలుగా ఉరుములు ఉరుముతుంటే "అర్జున ఫల్గుణ" అని జపిస్తే పిడుగుల నుంచి తప్పించుకోవచ్చంటారు. కానీ అర్జున ఫల్గుణ యే టైటిల్ గా గల ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పిడుగుపాటు నుంచి తప్పించుకోవడం కష్టమే. 

బాటం లైన్: "అర్జునా ఫల్గుణా" అన్నా ఎవరూ కాపాడలేరు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?