దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టే అని అంటున్నారు పరిశోధకులు. వారం రోజుల కిందటి సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది! గత వారంలో రోజుకు ఆరేడు వేల కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య పదహారు వేలను దాటేసింది! వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. కరోనా మూడో వేవ్ మొదలైనట్టే అని వైద్య శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కరోనా సెకెండ్ వేవ్ ఉపశమనం మొదలైంది. ఆగస్టు నుంచి కేసుల సంఖ్య దాదాపు తగ్గింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు కరోనా ఆంక్షలు దాదాపు లేకుండా ముగిశాయి. అయితే భయం అంటూ ఒకటి అలాగే ఉండింది. అలాగే పూర్తి స్థాయి స్వేచ్ఛా జీవనమూ సాధ్యం కాలేదు. మరోవైపు విదేశాల్లో కేసుల సంఖ్య పెరగడం.. ఇండియాలో కూడా ఆందోళన రేపుతూ వచ్చింది. చివరకు ఆ ఆందోళనలే నిజమై… మూడో వేవ్ షురూ అయినట్టుగా ఉంది. 2021 సంవత్సరం చివరి రోజుతో మూడో వేవ్ మొదలైనట్టే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.
ఇప్పటి వరకూ చూస్తే.. వేవ్ అంటూ మొదలైతే కనీసం రెండు నెలల పాటు విపరీత స్థాయిలో కేసుల సంఖ్య రావడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్. మే నెలల్లో సెకెండ్ వేవ్ లో భాగంగా విపరీతంగా కేసులు వచ్చాయి. మరి అలాంటి పరిస్థితే మొదలైతే.. కొత్త సంవత్సరంలో తొలి నెలలోనే ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల రావొచ్చేమో! రాబోయే నాలుగైదు వారాలు చాలా కీలకం అంటూ అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.
మరి ఈ సారి కేసుల సంఖ్య ఏ స్థాయి వరకూ వెళ్తుందనేది బిగ్గెస్ట్ కొశ్చన్. సెకెండ్ వేవ్ లో రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు కూడా నమోదయ్యాయి. తెలంగాణలో అయితే ఈ వేవ్ లో రోజుకు గరిష్టంగా ముప్పై వేల వరకూ కేసులు రావొచ్చని అంచనానట. మరి తెలంగాణ వాళ్లే ముప్పై వేల కేసులు వస్తాయనే అంచనాలు వేస్తున్నారంటే.. దేశమంతా ఏ రేంజ్ కు వెళ్లవచ్చో!
ఊరట ఏమిటంటే.. ఒమిక్రాన్ వేరియెంట్, ఇప్పటికే ఇండియా చవి చూసిన డెల్టా వేరియెంట్ అంత ప్రమాదకారి కాదు అనే మాట వినిపిస్తూ ఉండటం. ఇది లైట్ వేరియెంట్ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒకరకంగా టీకా లాంటిదే అని, ఇమ్యూనిటీని పెంచుతుందని, బహుశా మొత్తంగా కరోనా వైరస్ కే ఒమిక్రాన్ వేరియెంట్ క్లైమాక్స్ లాంటిదని కూడా పలువురు అంతర్జాతీయ పరిశోధకులు చెబుతూ ఉన్నారు.