సారాయి వీర్రాజుగా తనని అభివర్ణించేవారే రాత్రివేళ చుక్క వేసుకుంటారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వీర్రాజు. కేటీఆర్ తనపై చేసిన కామెంట్లపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేటీఆర్ తండ్రి అర్థరాత్రి వరకూ అదే మందు తాగుతారని, కానీ తనపై కేటీఆర్ విమర్శలు చేయడమేంటని అన్నారు.
తెలంగాణకు వచ్చే ఆదాయంలో మందు వాటా ఎంత అని ప్రశ్నించారు. చీప్ లిక్కర్ కామెంట్లని కాచుకోడానికి రోజుకో ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసుకోలేక తంటా పడుతున్న ఆయన.. తాజాగా మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అక్కసు వెళ్లగక్కారు.
జిన్నా టవర్ పేరు మార్చుతారా, 2024లో అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మార్చమంటారా..? ఈ ప్రశ్న చాలు సోము వీర్రాజు ఏ స్థాయిలో ఫ్రస్టేట్ అయ్యారో అర్థం చేసుకోడానికి. 2024లో తాము అధికారంలోకి వస్తామని గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు కూడా మార్చాలని, కేజీహెచ్ బదులు తెన్నేటి విశ్వనాధం హాస్పిటల్ (టీవీహెచ్), లేదా గౌతు లచ్చన్న హాస్పిటల్ (జి.ఎల్.హెచ్.) అని పేరు పెట్టాలని సూచించారు.
అక్కడితో ఆగారా.. లేదే..?
ఫ్రస్టేషన్లో ఉన్న వీర్రాజు మాటల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. ఏపీలో టమోటాల రేట్లు పెరిగాయని, ఉల్లిపాయల రేట్లు పెరిగాయని, సిమెంట్ బస్తాల రేట్లు పెరిగాయని దీనికి కారణం ప్రభుత్వమేనని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఉల్లిపాయలు, టమోటాలు, సన్నబియ్యం, సిమెంట్ బస్తాల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చేశారు.
అంతే కాదు, ప్రతి నియోజకవర్గంలో నాటు కోళ్ల ఫారాలు పెడతామని అన్నారు. ఇప్పుడు తన పేరు సిమెంట్ వీర్రాజు అంటారో, టమోటా వీర్రాజు అంటారో, కోడిగుడ్డు వీర్రాజు అంటారో.. మీ ఇష్టం అంటూ విలేకరులకు సలహా ఇచ్చారు.
అసలు వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టింది దేనికి. టమోటాలు, ఉల్లిపాయల రేట్ల గురించి మాట్లాడటానికా లేక దేనికి అనేది పక్కన ఉన్నవారికి కూడా అర్థం కాలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిమెంట్ రేటు, ఉల్లిపాయల రేటు ఎంతుందో వీర్రాజుకి తెలియదా, లేక పెట్రోల్ రేటు గురించి మాట్లాడ్డానికి వీర్రాజుకి గొంతులో ఏదైనా అడ్డుపడిందా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎటొచ్చి తన చీప్ లిక్కర్ ఇమేజ్ ను మాత్రం వీర్రాజు ఈ ప్రెస్ మీట్లతో మార్చుకోలేకపోతున్నారనేది వాస్తవం.