కర్ణాటక లోకల్ బాడీ పోల్స్ లో అధికార భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పై చేయి సాధించడం గమనార్హం. లోకల్ బాడీ సీట్ల వారీగా చూసుకున్నా, ఓటింగ్ పర్సెంట్ రీత్యా చూసుకున్నా కమలం పార్టీపై కాంగ్రెస్ పై చేయి సాధించింది.
కర్ణాటకలో తమ ప్రభుత్వంపై ప్రబలుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి భారతీయ జనతా పార్టీ శతథా ప్రయత్నిస్తూ ఉంది. అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం, రెండేళ్ల లోపే యడియూరప్పను సీఎం సీటు నుంచి దించేశారు. కుల సమీకరణాల లెక్కలేసుకుని.. యడియూరప్ప మనిషే అనిపించుకున్న బొమ్మైను సీట్లో కూర్చోబెట్టారు.
ఇక బీజేపీలోనే లిబరల్ అనిపించుకున్న బొమ్మై తీరా పగ్గాలు చేపట్టాకా, పాలనపై గ్రిప్ సాధించడం ఏమో కానీ మతం, మతమార్పిడిలు నియంత్రణ అంటూ అటు వైపు వెళ్లిపోయారు.
ఆయన రూటు అలా సాగుతుండగా.. లోకల్ బాడీ పోల్స్ లో మాత్రం బీజేపీ చీటీ చిరిగిపోయింది. మొత్తం 1,184 వార్డులకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ 498 వార్డుల్లో విజయం సాధించింది. కమలం పార్టీ 437 వార్డులకు మాత్రమే పరిమితం అయ్యింది. జేడీఎస్ నలభై ఐదు వార్డుల్లో మాత్రమే విజయం సాధించిన, పలు చోట్ల కింగ్ మేకర్ గా నిలుస్తోంది. ఇక ఇండిపెండెండ్ లు 200 లకు పైగా వార్డుల్లో నెగ్గారు.
ఎక్కడైనా స్థానిక ఎన్నికలు అంటే అధికార పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటాయి. ఓడిపోయిన ప్రతిపక్షాలు కూడా లోకల్ బాడీ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ తమ ఫెయిల్యూర్ స్టోరీని కవర్ చేసుకుంటూ ఉంటాయి. ఏపీలో అయితే.. పది శాతం సీట్లను కూడా గెలవలేకపోయింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. అదేమంటే.. అధికార పార్టీ చేతిలో పవర్ ఉంది కాబట్టి, స్థానిక ఎన్నికల్లో నెగ్గలేకపోయిందని, అసలు ఎన్నికలు జరిగితే మాత్రం అధికారం తమదే అంటూ టీడీపీ వాదిస్తూ ఉంటుంది.
ఏపీ సంగతిలా ఉంటే.. కమలం పార్టీకి అక్కడ కౌంట్ డౌన్ మొదలైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓట్ల శాతం విషయానికి వస్తే.. కాంగ్రెస్ ఏకంగా 42 శాతం ఓట్లను పొందింది. బీజేపీ దాదాపు 37 శాతం ఓట్లను పొందింది. జేడీఎస్ నాలుగు శాతం ఓట్లకు పరిమితం కావడం గమనార్హం.
ఓట్ల శాతం వారీగా చూసినా, సీట్ల వారీగా చూసినా… బీజేపీపై కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత సాధించింది. మరో ఏడాదిన్నర వ్యవధిలోపే అక్కడ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కర్ణాటకలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ స్వల్ప మెజారిటీలతో బయటపడటం, సానుభూతి కోటాలోని ఎన్నికల్లో కూడా ఐదారు వేల మెజారిటీని కూడా సాధించలేకపోయిన వైనం కూడా చర్చనీయాంశంగా నిలుస్తోంది.