పవన్, రాధా, ముద్రగడ.. కాపు హీరో ఎవరు..?

ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇద్దరు నేతలు ప్రతినిధులుగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ముందుగా ఒకరు సీఎం అయ్యారు, ఆ తర్వాత రెండోవారు అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు మూడో సామాజిక…

ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇద్దరు నేతలు ప్రతినిధులుగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ముందుగా ఒకరు సీఎం అయ్యారు, ఆ తర్వాత రెండోవారు అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు మూడో సామాజిక వర్గం కూడా అధికారం కోసం ప్రయత్నిస్తోంది. కానీ వారికి నాయకుడు కరువయ్యారు. ఏపీలో కాపు నాయకుడు ఎవరు అంటే ఏదో ఒక పేరు ఎవరూ ఫైనల్ గా చెప్పలేరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది పరిస్థితి.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రాధా హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల వంగవీటి రంగా వర్థంతి సభలో తన హత్యకు రెక్కీ జరిగిందని రాధా ప్రకటించడం, ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకు గన్ మెన్లను పెంచుతామనడం, ఆయన ఒప్పుకోకపోవడం, మధ్యలో చంద్రబాబు లేఖ.. ఇవన్నీ రాధాని వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి.

ఇక ఆయన పొలిటకల్ కెరీర్ విషయానికొస్తే, టీడీపీకి ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు, అలాగని వైసీపీ వారికి దగ్గరగా లేరు. మరోసారి జగన్ దగ్గరకు వచ్చే ఆలోచన ఆయనకు ఉందో లేదో తెలియదు. అటు జనసేన నేతలు కూడా రాధాకు టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అసలు రాధా ఏ పార్టీలో చేరతారు, సొంతంగా కాపుల కోసం పార్టీ పెడతారా..? తండ్రి ఇమేజ్ ని వాడుకుని రాజకీయాల్లో ఎదగగలరా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం దొరకదు. కానీ కాపు సామాజిక వర్గంలో వంగవీటి వారసుడిగా రాధాకు మంచి పేరుంది. టీడీపీలో చేరి తన క్రేజ్ తగ్గించుకున్నారు కానీ రాధాకు కాపుల్లో ఇప్పటికీ ఓ ఇమేజ్ ఉంది.

ముద్రగడ పార్టీ పెడతారా..?

టీడీపీకి, వైసీపీకి సమ దూరం పాటిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఇటీవల చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ తో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. ఎంతమందిని ఏడ్పించావు బాబూ అంటూ ఆయన ఓ సుదీర్ఘ లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో ముద్రగడ వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అనే అనుమానాలున్నా.. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్, ముద్రగడ ఆలోచనలు వేరు. అందుకే ఆ భిన్న ధృవాలు కలిసే అవకాశం లేదు. 

ఇక కాపుల్లో ముద్రగడకు మంచి ఇమేజ్ ఉంది. తమ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారని ఆయనపై సింపతీ ఉంది. కానీ పోరాటాలను మధ్యలో ఆపేస్తారనే అపవాదు కూడా ఆయనపై ఉంది.

పవన్ కల్యాణ్ సత్తా ఎంత..?

కాపుల ఓటు బ్యాంక్ తో అధికారంలోకి రావాలనే పగటి కలలు ఎక్కువగా కనే వ్యక్తి పవన్ కల్యాణ్. అభిమానులు ఓట్లేస్తారు, కాపులు ఓట్లేస్తారు నేనే సీఎం అంటూ.. 2019లో బొక్కబోర్లా పడ్డారాయన. దీంతో మరోసారి మధ్యేమార్గంగా ఇతర పార్టీలను నమ్ముకుని పరాన్నజీవిగా మారిపోయారు. అయితే కాపుల్లో పవన్ కల్యాణ్ ని నాయకుడిగా అంగీకరించేవారు ఎంతమంది అనేది సమాధానం లేని ప్రశ్న.

పవన్ కల్యాణ్ ని అభిమానిస్తాం, జగన్ కి ఓటేస్తాం అంటుంటారు కాపు యువత. సినిమా హీరోగా పవన్ ని ఆరాధించేవారంతా రాజకీయ నాయకుడిగా ఆయన్ను గుర్తించరు. ఆ మాటకొస్తే చంద్రబాబుకి పవన్ వంతపాడటం వారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే పవన్ ని వారు తమ నాయకుడిగా గుర్తించడం లేదు.

ముగ్గురిలో ఎవరు..?

వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఇతర కీలక నేతలు ఉన్నా కూడా వారెప్పుడూ కుల రాజకీయాలు చేయాలనుకోలేదు. అందులోనూ తమ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా ఉందామనే ఆలోచన కూడా వారికి లేదు. ఇక వైసీపీకి దూరంగా ఉన్న వారిలో వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురే ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ముగ్గురూ కలిసే అవకాశం ఉందా.. లేక ఎవరికి వారే రాజకీయాలు చేస్తారా..? అసలు ఈ ముగ్గురిలో అసలైన నాయకుడెవరు..? ముందు ముందు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.