ప్రముఖ విద్యా సంస్థ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ భూ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
గీతమ్ భూముల కేటాయింపు, ఆక్రమణలకు సంబంధించి చాలా సంవత్సరాలుగా వివాదం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయాచితంగా ఈ విద్యా సంస్థ భారీగా భూలబ్ధిని పొందిందనే ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేసి మరీ చంద్రబాబు ప్రభుత్వం ఆ భూములను గీతమ్ వర్సిటీకి కట్టబెట్టిన చరిత్ర ఉంది. గతంలో విశాఖ కలెక్టర్లు ఈ కేటాయింపుల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో వేరే కలెక్టర్లు వచ్చి గీతమ్ కు భూముల కేటాయింపుకు సిఫార్సలు చేయడం, కేబినెట్ వాటికి చకచకా ఆమోదం తెలపడం జరిగింది.
చంద్రబాబు నాయుడుకు గీతం ఒకప్పటి యజమాని ఎంవీవీఎస్ మూర్తి చాలా దగ్గరి బంధువు అనే సంగతి తెలిసిందే. ఆయన చాలా చాకచక్యంగా భూ ఆక్రమణ పర్వాన్ని కొనసాగించారనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ఈ భూ కేటాయింపులు, ఆక్రమణల పర్వంపై దృష్టి పెట్టింది. గీతమ్ యాజమాన్య కుటుంబమే చంద్రబాబు బామ్మర్ది కమ్ వియ్యంకుడు బాలకృష్ణతో వియ్యమందింది. మూర్తి మనవడు భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు ఈ భూ కేటాయింపు అంశంపై విచారణ జరపగా రుషికొండ, ఎందాడ పరిధుల్లో సుమారు 40 ఎకరాల భూమిని గీతమ్ వర్సిటీ అక్రమంగా ఆక్రమించిందని నిర్ధారణ అయినట్టుగా సమాచారం.
ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కార్యాచరణను ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది.