తను అనుకున్నది సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, అడ్డుకునే ప్రయత్నాలు చేసినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా, చివరికి కోర్టు కేసులు వేసినా ఏదో ఒక విధంగా తను అనుకున్నది సాధించి తీరతారు. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ నూతన సచివాలయం. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు ధరణి పోర్టల్ తో స్పీడ్ బ్రేకర్ పడింది.
15 రోజుల గడువులోగా తెలంగాణలో ఆస్తుల వివరాలన్నీ కచ్చితంగా నమోదు కావాల్సిందేనంటూ డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్ కు కోర్టులో చుక్కెదురైంది.. కోర్టు గట్టిగా అడిగేసరికి మాట మార్చేశారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు చేసుకోడానికి నిర్దిష్ట గడువేదీ లేదని, అది నిరంతర ప్రక్రియ అని హైకోర్టుకు స్పష్టం చేశారు.
గడువులేని నిరంతర ప్రక్రియ అంటే దాని వల్ల ఏమాత్రం ఉపయోగం లేనట్టే. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనట్టే. ఇక నమోదులో భాగంగా కులం, ఆధార్ వివరాలు అడగడంపై కూడా కోర్టు ప్రశ్నించడంలో ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో ఇన్నాళ్లూ శరవేగంగా జరిగిన ధరణి పనులు ఒక్కసారిగా మందగమనంలోకి వచ్చేశాయి.
వాస్తవానికి ఆస్తుల వివరాలు చెప్పడానికి ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకొస్తారని అంచనా వేయలేం. బీదా బిక్కీ కూడా.. ప్రభుత్వ సాయం అందుతుందేమోనని తమకి సెంటు భూమి కూడా లేదని చెబుతారు. అయితే ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత ఆస్తులు చెప్పకపోతే, వాటిపై హక్కు కోల్పోతారంటూ ప్రభుత్వం మెలిక పెట్టడంతో ప్రజలు కూడా భయపడ్డారు. బినామీల పేరుతో ఆస్తులు పోగేసుకున్నవారు అల్లాడిపోయారు.
నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఎప్పుడైతే కోర్టుకు విన్నవించిందో అప్పుడే ధరణి ఆశయం సడలింది. పైగా వివరాలు చెప్పకపోతే ఆస్తులపై హక్కు కోల్పోతారంటూ చెప్పే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు.
పోనీ అక్రమార్కులకు మాత్రమే ఇది ఇబ్బంది అనుకుంటే.. గొడవల్లో ఉన్న ఆస్తుల వివరాలు తేలేది ఎప్పుడు? ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు ధరణి పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ప్రయత్నిస్తే, అధికారులు ఎవరి మాట వినాలి. తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్లు కోకొల్లలు. వాటన్నిటికీ పరిష్కారం ఎవరు చూపిస్తారు. కోర్టులో కేసులు నడుస్తున్న విషయాలపై ఎవరు క్లారిటీ ఇస్తారు.
ఇన్ని అడ్డంకులు పెట్టుకుని కూడా 15 రోజుల గడువులోగా తెలంగాణలో ఆస్తుల వివరాలన్నీ కచ్చితంగా నమోదు కావాల్సిందేనంటూ హుకుం జారీచేసిన కేసీఆర్ స్పీడ్ కు కోర్టు బ్రేకులేసింది.
నిజానికి సీఎం కేసీఆర్ చేస్తున్న పని మంచిదే. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో భూ తగాదాలు, కబ్జాలు పూర్తిగా అరికట్టడానికి వీలౌతుంది. కానీ అన్నీ ఆఘమేఘాల మీద అయిపోవాలనుకోవడం, మరీ ముఖ్యంగా 'ధరణి' లాంటి కీలకమైన కార్యక్రమాన్ని రోజుల వ్యవథిలో ముగించాలని అనుకోవడం తప్పు. ఈ విషయంలో ఇప్పుడు కేసీఆర్ వెనక్కి తగ్గినట్టే.