అందుకే…జిన్నా ట‌వ‌ర్ ఎక్కిన బీజేపీ!

మ‌త్తు వ‌దిలించుకోడానికే బీజేపీ ‘జిన్నా’ ఎత్తుగ‌డ వేసిందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవ‌ల ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో సోము వీర్రాజు త‌మ‌ను అధికారంలోకి తెస్తే…చీప్ లిక్క‌ర్‌ను రూ.50కే ఇస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ…

మ‌త్తు వ‌దిలించుకోడానికే బీజేపీ ‘జిన్నా’ ఎత్తుగ‌డ వేసిందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవ‌ల ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో సోము వీర్రాజు త‌మ‌ను అధికారంలోకి తెస్తే…చీప్ లిక్క‌ర్‌ను రూ.50కే ఇస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ కామెంట్స్ దేశ వ్యాప్తంగా బీజేపీని భారీ ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి. సోము మందు మాట‌లు బీజేపీపై ప్ర‌జాగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. జ‌నానికి మ‌త్తెక్కిస్తామ‌నుకున్న బీజేపీ…చివ‌రికి అన్ని వైపుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుండ‌డంతో మ‌త్తు దిగింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో సోము వీర్రాజు చీప్ లిక్క‌ర్ కామెంట్స్ నుంచి స‌మాజాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు జిన్నా ట‌వ‌ర్ అంశాన్ని తెర‌పైకి తెచ్చింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి జిన్నా ట‌వ‌ర్‌ను మార్చాలంటూ విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత స‌త్య‌కుమార్ మాట్లాడుతూ మహ్మద్‌ అలీ జిన్నా భారతదేశ ద్రోహి అని విమ‌ర్శించారు. 

అలాంటి  వ్యక్తి పేరుమీద గుంటూరు వంటి ప్రధాన నగరంలో టవర్‌ ఉండటానికి వీల్లేద‌ని, దాని పేరు మార్చి అబ్దుల్‌ కలాం లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని కోరారు. జిన్నాపేరు మార్చాలని లేదంటే బాబ్రీ మసీదు కూల్చినట్లు కూల్చివేస్తామని బీజేపీ నేత‌లు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.  

స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని కూలుస్తామ‌ని బీజేపీ హెచ్చ‌రించ‌డం, ఆ పార్టీ దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని వైసీపీ, కాంగ్రెస్ విమ‌ర్శిస్తున్నాయి. జిన్నాటవర్ నేప‌థ్యం తెలిసి కూడా, రాజ‌కీయ స్వార్థంతో బీజేపీ మ‌తం ప్రాతిపదిక‌న స‌మాజంలో విద్వేషాలు సృష్టిస్తోంద‌ని పౌర స‌మాజం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. 

కేవ‌లం సోము వీర్రాజు ,చీప్ లిక్క‌ర్‌పై చేసిన కామెంట్స్ నుంచి ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు జిన్నా ట‌వ‌ర్ అంశాన్ని బీజేపీ సామాజిక స‌మ‌స్య‌గా సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే జిన్నా ట‌వ‌ర్ ఎందుకు గుర్తొచ్చిందో బీజేపీ స‌మాధానం చెప్పాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  ప్ర‌జాగ్ర‌హం నుంచి త‌ప్పించుకునేందుకు బీజేపీ జిన్నా ట‌వ‌ర్ ఎక్కింద‌నే సెటైర్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి.