“బై నౌ, పే లేటర్”.. ఇలాంటి స్లోగన్లతో ఈఎంఐల ఆఫర్లు వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. అయితే ఈ ఆఫర్ ని కాస్త సరిచేశాయి సంకాష్, రాడిసన్ హోటల్స్ సంస్థలు. ఈ రెండు సంస్థలు కలసి కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. ”మ్యారీ నౌ, పే లేటర్”(MNPL) అంటూ బ్రహ్మచారుల్ని ఊరిస్తున్నాయి.
ఇప్పటివరకూ ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ ఇస్తుండేవి. కొన్నింటిపై సున్నా వడ్డీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ లోన్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీన్ని లోన్ అనుకోవచ్చు, లేదా 12 సులభ వాయిదాల్లో వడ్డీ లేకుండా తీసుకునే రుణం అనుకోవచ్చు. కానీ దీని స్పెషాలిటీ ఒక్కటే కేవలం పెళ్లి చేసుకునేవారికి మాత్రమే దీన్ని ఇస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పాతిక లక్షలు ఈఎంఐ కింద అందిస్తారు.
గరిష్టంగా పాతిక లక్షల రూపాయల్ని MNPL పథకం ద్వారా ఈఎంఐ ఫెసిలిటీతో అందిస్తున్నాయి సంకాష్, రాడిసన్ హోటల్స్ సంస్థలు. భారీ హంగులతో ఆర్భాటంగా వివాహం చేసుకునేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. పాతిక లక్షల వరకు రుణం ఇస్తున్నా.. వడ్డీలేని ఈఎంఐలు కావాలంటే ఆరు నెలల్లో వాయిదాలన్నీ పూర్తి చేయాలి. ఆరు నెలల్లో వడ్డీలేని ఈఎంఐ వద్దు అనుకుంటే, 1 శాతం వడ్డీతో 12 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది.
పెళ్లి కొడుకు, లేదా పెళ్లి కూతురు జీతం, సిబిల్ స్కోర్ ఆధారంగా MNPL కింద ఎంత రుణం మంజూరు చేయగలరో డిసైడ్ చేస్తారు. పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టుకోకపోయినా, తమ పెళ్లితో కుటుంబాలకు భారం కాకూడదు అనుకునే వారికి ఈఎంఐ ఫెసిలిటీ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు నిర్వాహకులు.
ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ మ్యారేజ్ లోన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.