జనసేనాని పవన్‌కల్యాణ్ పార్టీ స్థాపించి పదేళ్లు గడిచే సమయానికి ఓ సత్యాన్ని కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తన కులం (కాపు) అత్యంత శక్తిమంతమైందని, దాన్ని నమ్ముకుంటేనే భవిష్యత్ వుంటుందని భావించారు. దీంతో తన పార్టీ లక్ష్యమైన కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలనే నిబంధనను గట్టు మీద పెట్టి, కుల నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇందుకు నిన్నటి జనసేన ఆవిర్భావ సభ వేదికైంది.
కాపు కుల నినాదం తమపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాందోళన టీడీపీలో కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు వుంటుందనే సంకేతాల్ని పవన్ కల్యాణ్ పదేపదే పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో కాపులంటే గిట్టని కులాలు తమకు రాజకీయంగా దూరం అవుతాయని టీడీపీ భయపడుతోంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, మిగిలిన కులాలను కలుపుకుని పోవాలని పవన్‌కల్యాణ్ పిలుపు ఇవ్వడం వరకూ బాగా వుంది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలతో మిగిలిన సామాజిక వర్గాలకు అంత మంచి సంబంధాలు లేవన్నది వాస్తవం. అందువల్లే పవన్ తన సామాజిక వర్గానికి ప్రత్యేకంగా అందరితో మంచిగా మాట్లాడాలని, కలుపుకెళ్లాలని పిలుపు ఇవ్వడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రకరకాల కారణాల వల్ల కాపులతో క్షత్రియులు, బీసీలు, మైనార్టీలు, దళితులు తదితర అణగారిన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
వీరంతా పవన్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేతలు గ్రహించారు. అందుకే ఇటీవల కాలంలో పవన్‌తో పొత్తు విషయమై చంద్రబాబు, లోకేశ్ తదితర ముఖ్య నేతలు నోరు మెదపడం లేదు. ఇటీవల పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ జనసేనతో పొత్తు వుందని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. భవిష్యత్‌లో పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే, కనీసం కాపులంతా కూడా తమకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు.
స్వయంగా పవన్‌కల్యాణే తనకు కాపులు ఓట్లు వేయలేదని, అందువల్లే రెండు చోట్ల ఓడిపోయానని చెప్పడాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పవన్‌కే అండగా నిలబడని కాపులు, ఇప్పుడు ఆయన చెబితే తమకు ఓట్లు వేస్తారని ఎలా నమ్మాలంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్‌తో పొత్తు పెట్టుకుంటామనే ప్రచారం వల్ల ఇప్పటికే బీసీల్లో 75 శాతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సానుకూలంగా మారారనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.
పవన్‌కు వ్యతిరేకంగా కొన్ని సామాజిక వర్గాలు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ వైపు నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో పవన్ పొత్తు కుదుర్చుకోవడం రాయలసీమలో బలిజలకు ఆమోద యోగ్యమే. కానీ కోస్తాకు వెళితే ఎంత మాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ టీడీపీతో జనసేనాని పొత్తు పెట్టుకుని, కేవలం 20-25 అసెంబ్లీ సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తే కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను మోసగించారనే అక్కసుతో కాపులు వ్యతిరేకంగా పని చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాపు నాయకుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య నేరుగానే పవన్ ఎదుట తన అనుమానాల్ని, టీడీపీ ప్రచారంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో జనసేన ద్వితీయ శ్రేణి నేతలంతా పవనే ముఖ్యమంత్రి కావాలని ముక్త కంఠంతో నినదించారు.
జనసేన నేతలు, కార్యకర్తల అంతరంగానికి విరుద్ధంగా పవన్ ముందుకెళితే మరోసారి పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. పవన్‌తో పొత్తు వల్ల ఇటు కాపులు ఆదరించక, అటు మిగిలిన సామాజిక వర్గాలు దూరమై… ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. రానున్న రోజుల్లో పవన్‌ను విడిపించుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.