అధికారిక విడాకుల కోసం ఎదురు చూపు

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారికంగా త‌మ‌కు విడాకులు ఎప్పుడిస్తారా? అని ఏపీ బీజేపీ ఎదురు చూస్తోంది. అయితే విడాకుల‌కు బీజేపీనే కార‌ణ‌మ‌నే నింద‌ను వేయ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్మూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బ‌ల‌మైన వాద‌న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారికంగా త‌మ‌కు విడాకులు ఎప్పుడిస్తారా? అని ఏపీ బీజేపీ ఎదురు చూస్తోంది. అయితే విడాకుల‌కు బీజేపీనే కార‌ణ‌మ‌నే నింద‌ను వేయ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్మూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బ‌ల‌మైన వాద‌న తెర ముందుకు తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌లు అంటున్నారు. 

తెలంగాణ‌లో జ‌న‌సేన పోటీ చేస్తానంటే ఆంధ్రా నేత‌న‌ని త‌న‌ను అక్క‌డి బీజేపీ నేత‌లు అంటున్నార‌ని మ‌చిలీప‌ట్నం బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచి ప‌వ‌న్ అన్నారు. అలాగే ఏపీలో అధికారికంగా బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఉన్న‌ప్ప‌టికీ, ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ క‌లిసి కార్య‌క్ర‌మాలు చేసిన దాఖ‌లాలు లేవు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే త‌న‌కు తానుగా బీజేపీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డైనా ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తు కుద‌ర‌డం చూశాం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా బీజేపీతో జ‌న‌సేనాని పొత్తుకు త‌హ‌త‌హ‌లాడారు. చివ‌రికి తాను అనుకున్న‌ట్టుగానే వారితో బంధాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు.

తాజాగా ఏపీ బీజేపీ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాష్ట్ర‌స్థాయిలో క‌లిసి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి ఏపీ బీజేపీ నేత‌లెవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. బీజేపీ, తాము క‌లిసి అనుకున్న ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసి వుంటే ఇప్పుడు టీడీపీతో అవ‌స‌రం లేని స్థాయికి ఎదిగే వాళ్ల‌మ‌ని బంద‌రు స‌భా వేదిక మీద నుంచి ప‌వ‌న్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. 

అమ‌రావ‌తి రాజ‌ధానికి కేంద్ర బీజేపీ ఓకే చెప్పిన సంగ‌తిని గుర్తు చేశారు. అలాగే అమ‌రావ‌తి కోసం లాంగ్‌మార్చ్ చేద్దామ‌ని అనుకున్నామ‌ని, ఆ త‌ర్వాత బీజేపీ నాయ‌కులు వాయిదా వేశార‌న్నారు. అమ్మా పెట్ట‌దు, అడుక్కు తిన‌నివ్వ‌ద‌నే సామెత చందాన ఏపీ బీజేపీ తీరు వుంద‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దీంతో బీజేపీ వైఖ‌రి వ‌ల్లే తాను టీడీపీ వైపు చూడాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న నేరుగానే చెప్పారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గుడివాడ‌లో స్పందించారు. జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుపై ఎక్కువ‌గా మాట్లాడ‌ని విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. కేవ‌లం బీజేపీతో పొత్తుపైన్నే ప‌వ‌న్ మాట్లాడార‌న్నారు. టీడీపీతో పొత్తుపై జ‌న‌సేన క్లారిటీ ఇచ్చిన త‌ర్వాత భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. 

టీడీపీతో ప‌వ‌న్ వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఏపీ బీజేపీ నేత‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అదేదో త్వ‌ర‌గా చెబితే, మా ప‌నేదో మేం చూసుకుంటామ‌న్న‌ట్టుగా సోము వీర్రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేనాని వ్య‌వ‌హార‌శైలిపై కేంద్ర బీజేపీ కూడా ఏపీ బీజేపీకి క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. 

ఇక ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, ఒంట‌రిగా బ‌ల‌ప‌డేందుకు కృషి చేయాల‌ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు అధిష్టానం స్ప‌ష్ట‌మైన మార్గ‌నిర్దేశం చేసిన‌ట్టు స‌మాచారం. త‌మ‌ను కాద‌ని టీడీపీతో జ‌త క‌ట్టే ప‌వ‌న్‌ను బీజేపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.