తెలంగాణలో 3 రోజులుగా సంచలనం సృష్టించిన మెహబూబాబాద్ కిడ్నాప్ వ్యవహారం చివరికి విషాదాంతంగా మిగిలిపోయింది. కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురవ్వడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. కానీ బాలుడ్ని మాత్రం సజీవంగా పట్టుకోలేకపోయారు.
మెహబూబాబాద్ లోని కృష్ణ కాలనీలో ఉంటున్న రంజీత్-వసంత దంపతుల 9 ఏళ్ల కొడుకు దీక్షిత్ రెడ్డి ఇంటిముందు రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి దీక్షిత్ ను తన బైక్ పై ఎత్తుకెళ్లాడు. అదే రోజు రాత్రి రంజిత్-వసంతలకు కాల్ చేశాడు. 45 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.
బుధవారం నాటికి తల్లిదండ్రులు డబ్బు సిద్ధం చేసి, కిడ్నాపర్ చెప్పిన చోటికి వెళ్లారు. డబ్బుతో మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు అదే చోట వెయిట్ చేసినప్పటికీ, కిడ్నాపర్ రాకపోవడంతో వెనుదిగిగారు. అయితే మరోవైపు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దాదాపు వంద మంది పోలీసులు ఈ కిడ్నాప్ కేసుపై వర్క్ చేశారు. దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు కూడా.
అయితే తను దొరికిపోతాననే భయంతో బాలుడ్ని అపహరించిన గంటన్నరకే గొంతు నులిమి హత్యచేశాడు కిడ్నాపర్. ఆనవాళ్లు దొరక్కూడదనే ఉద్దేశంతో తర్వాత మృతదేహాన్ని తగలబెట్టాడు. కేసముద్రం మండలం అన్నారం సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బాలుడ్ని కిడ్నాప్ చేసింది, తల్లిదండ్రులకు ఫోన్ చేసింది, హత్యచేసింది ఒకడే అనే విషయాన్ని పోలీసులు నిర్థారించారు. ఒకేసారి లక్షల్లో డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితుడు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు వెల్లడించారు మెహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి. అందుకే బాబును చంపేసినప్పటికీ డబ్బు కోసం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద ఓ వ్యక్తి దురాశకు అభంశుభం తెలియని బాబు బలైపోయాడు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.