కులానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు కీలక ప్రశ్నలు వేసింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదులో భాగంగా కులం వివరాలు అడిగితే తప్పేంటని పిటిషనర్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైకోర్టు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
‘గత 60 ఏళ్లుగా మనం పాఠశాల స్థాయి నుంచి కులం వివరాలు సమర్పిస్తూనే ఉన్నాం కదా, అలాంటప్పుడు కులం వివరాలు ఇవ్వడానికి ఇబ్బందేంటి’ అని గట్టిగా నిలదీసింది. ఇటీవల తెలంగాణ సర్కార్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భూముల, ఇతర ఆస్తిపాస్తుల నమోదుకు ధరణి అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సమర్పించాలని, అందులో కులం, ఆధార్ వివరాలు నమోదు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇందులో భాగంగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం కులం, ఆధార్ వివరాలను అడుగుతోందన్నారు.
ఈ నెల 25లోగా ఈ వివరాలు సమర్పించాలంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ వివరాల నమోదుకు ఎలాంటి డెడ్‌లైన్ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదిని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది.
‘కులం చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది. కులం చెప్పుకోవడాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలి. వ్యక్తులను గుర్తించేం దుకు ఇది తప్పనిసరి. ఆధార్ వివరాలను ఎవరికీ వెల్లడించకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆధార్ వివరాలు వెల్లడించడం వల్ల ఏం నష్టం’ అని ధర్మాసనం ప్రశ్నించింది.