వారినీ వీరినీ చూడకుండా అందరికీ అందలం ఎక్కించారు చంద్రబాబు. అక్కడ బోలెడు పార్టీ పదవులు ఉన్నాయి మరి. జాతీయ కమిటీలు, సెంట్రల్ కమిటీలు, రాష్ట్ర కమిటీలు , ఆనక పాతిక పార్లమెంట్ సీట్లకు ప్రెసిడెంట్ గిరీలు. ఇలా చాలానే పదవులు సృష్టించి మరీ తమ్ముళ్లను బాబు సత్కరించారు.
అడిగిన వారికే కాదు, అడగని వారికీ పదవులు ఇచ్చేశారు. రేపో మాపో పార్టీని వీడిపోతారని టాక్ వచ్చిన వారికైతే మరింత సన్మానం చేస్తూ పార్టీలో పెద్ద పదవులు కట్టబెట్టారు. అంతా బాగానే ఉంది కానీ విజయనగరం జిల్లాలో ఘనమైన బొబ్బిలి రాజులు ఉన్నారు. వారిది సుదీర్ఘ చరిత్ర. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి మోజుపడి తీసుకొచ్చి మరీ సుజయక్రిష్ణ రంగారావుని మంత్రిని కూడా చేశారు బాబు.
అలాంటిది ఇపుడు ఆయన ఎందుకు కంటికి కనిపించలేదో అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన్ని కూడా ఏ పొలిట్ బ్యూరో మెంబర్ గానో, జాతీయ ప్రధాన కార్యదర్శిగానో నియిమించవచ్చు కదా అన్నది ఒక చర్చ.
అయితే బాబు ఆయన ఒక్కరినే కాదు, గతంలో వైసీపీ నుంచి చేరదీసి కండువాలు కప్పిన ఎవరినీ ఈసారి దరిదాపులకు రానీయకపోవడం విచిత్రమే. అంటే రాజకీయమే తప్ప వారి మీద నిజమైన అభిమానం ఏదీ లేదని బాబు తాజా చర్యల ద్వారా మరో మారు నిరూపించుకున్నారన్నమాట. ఇక బొబ్బిలి రాజా వారే దీని మీద ఏదో ఒకటి నిర్ణయించుకోవాలేమో.