నోరు కాదు అచ్చెన్నా.. లాజిక్ కావాలి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అనే పోస్ట్ కొత్తగా రావడంతో.. బెయిలుపై బైటకొచ్చిన అచ్చెన్నాయుడి నోరు ఇప్పుడు తెరుచుకుంది. ఈఎస్ఐ కుంభకోణం బైటపడ్డ తర్వాత ఇన్నాళ్లూ నోరు మెదపని అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో…

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అనే పోస్ట్ కొత్తగా రావడంతో.. బెయిలుపై బైటకొచ్చిన అచ్చెన్నాయుడి నోరు ఇప్పుడు తెరుచుకుంది. ఈఎస్ఐ కుంభకోణం బైటపడ్డ తర్వాత ఇన్నాళ్లూ నోరు మెదపని అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి నోరు చేసుకున్నారు. కొత్తగా పదవి రావడంతో దానికి సార్థకత తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ బీమా పథకంపై నోరు పారేసుకున్న ఆయన.. మా హయాంలో అలా చేశాం, మీ హయాంలో ఇలా చేశారంటూ కాకి లెక్కలు చెప్పారు.

చంద్రన్న బీమా పేరు మార్చి వైఎస్సార్ బీమా పేరు పెట్టారనేది ఆయన ప్రధాన ఆరోపణ. గతంలో చంద్రన్న బీమా పేరుతో 15 రూపాయల ప్రీమియం వసూలు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అది 15 రూపాయలతో సరిపోయేది కాదు, బీమా కావాల్సిన ప్రతి ఒక్కరి దగ్గర 50రూపాయలు వసూలు చేశారు టీడీపీ కార్యకర్తలు. జన్మభూమి కమిటీల దగ్గర బీమా దరఖాస్తులు నింపేవారు. అప్పుడు కూడా అస్మదీయులకే పెద్దపీట.

కానీ ఇప్పుడు జగన్ హయాంలో ప్రీమియం మాటే లేదు. కేంద్రం చేతులెత్తేసినా.. జగన్ ప్రభుత్వం లబ్ధిదారుల తరపున ప్రీమియం మొత్తం చెల్లిస్తోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి బీమా పరిహారం జమ చేయబోతోంది.. ఈ పాయింట్ తో తమ అవినీతిని తామే బైటపెట్టుకున్నారు అచ్చెన్నాయుడు.

ఇక రెండో ఆరోపణ బీమా పొందే లబ్ధిదారుల సంఖ్య. టీడీపీ హయాంలో రెండున్నర కోట్ల మందికి బీమా వర్తించేదట. ఇప్పుడు కోటీ 10లక్షల మందికి బీమాని దూరం చేశారట. రాష్ట్రంలో రైస్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ బీమాకు అర్హులేనని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ లెక్కన చూసుకుంటే, రాష్ట్రంలో 1,51,85,166 రైస్ కార్డులున్నాయి. సగటున కుటుంబానికి ఇద్దరు వ్యక్తులున్నా.. మూడు కోట్లకు పైగా లబ్ధిదారులుంటాయి. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువమందే లబ్ధిదారులున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం గతంలో కేవలం రెండున్నర కోట్లమందికి పథకాన్ని అమలు చేస్తే, జగన్ సర్కారు.. 3 కోట్ల కంటే ఎక్కువ మందికి వైఎస్సార్ బీమాని చేరువ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల పేరుతో చాలామందిని ఈ పథకానికి అనర్హులుగా తేల్చింది. కానీ అసంఘటిత రంగం అనే పేరు లేకుండానే.. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరినీ వయస్సు నిబంధన ప్రకారం ఈ పథకంలో చేర్చింది. ఇక్కడ కూడా అచ్చెన్న తప్పులో కాలేశారు, తమ తప్పుల్ని ఒప్పేసుకున్నారు.

అసెంబ్లీలోలా బైటకూడా గొంతు పెద్దది చేసుకుని మాట్లాడితే సరిపోతుంది అనుకున్న అచ్చెన్నాయుడు, లాజిక్ లేకుండా మాట్లాడి భలేగా బుక్కయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే అభాసుపాలయ్యారు.