నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయకుమార్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సినిమాల కంటే ఆమె వ్యక్తిగత జీవితమే వనితాను అందరికీ తెలిసేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. తన కుమార్తె తనను మూడో పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతోందని, తాజాగా చేసుకునే పెళ్లికి కుటుంబ సభ్యుల మద్దతు ఉందని ఎంతో గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే.
రెండు పెళ్లిళ్లు కలిసి రాని నేపథ్యంలో ముచ్చటగా మూడోపెళ్లికి ఆమె ముందుకొచ్చారు. ఇటీవల పీటర్‌పాల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. పీటర్‌పాల్‌ను పెళ్లి చేసుకోవడంపై కూడా సినీరంగానికి చెందిన సాటి నటీనటులు, దర్శకనిర్మాతలు కొందరు అవహేళనగా ట్వీట్లు చేశారు. ఈ వ్యవహారం కాస్త పోలీసు కేసుల వరకు వెళ్లింది.
తాజాగా ఆమె మూడో పెళ్లిపై కూడా నీలి నీడలు కమ్ముకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త మద్యానికి బానిసయ్యాడని ఆమె వాపోతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల ఈ జంట గోవాకు విహారయాత్రకని వెళ్లారు. అక్కడే వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వనితా చెన్నైకి ఒక్కటి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో పీటర్‌పాల్‌ను వదిలేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులోనూ తన భర్త గురించి ఆమె షేర్ చేసిన వీడియో విడిపోయిన వార్తలకు బలం కలిగిస్తోంది. ఇంతకూ ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే…
‘పీటర్‌పాల్ మద్యానికి పచ్చి బానిస. అంతేకాదు ఆయన చైన్ స్మోకర్. అతనికి రెండు సార్లు గుండెపోటు రావడంతో రూ.25 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు పీటర్ పాల్‌కు ఆరోగ్యం బాగైంది. మళ్లీ మద్యం తాగడం స్టార్ట్ చేశాడు. తాగుడుకు దూరంగా ఉంటానని నాకు ప్రమాణం చేసి …దాన్ని నిలబెట్టుకోలేదు.
ఇది నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. అందుకే నేనీ నిర్ణయానికి వచ్చాను’ అని వనితా విజయకుమార్ చెప్పుకొచ్చారు. తానీ నిర్ణయానికి రావడం అంటే …విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వనితా విజయ్‌కుమార్ మూడో పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటే అయిందని చెప్పొచ్చు.