ఎట్టి పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఆపే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను నిలుపుదల చేయాలనే డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఒమిక్రాన్ వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వాయిదా విషయాన్ని పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఎన్నికల కమిషన్‌కు సూచించింది.
దీంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఆరంభంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకమైంది.
ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో ఈసీ సమావేశమైంది. అనంతరం రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ పర్యటించింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికలపై అభిప్రాయాలు సేకరించింది. అనంతరం ఇవాళ లఖ్‌నవూలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ సుశిల్ చంద్ర అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని అన్ని పార్టీలు కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సమయంలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా బూత్‌ల సంఖ్య పెంచుతామన్నారు. దీంతో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చినట్టైంది. అయితే కరోనా థర్డ్ వేవ్‌ను ఎలా కట్టడి చేస్తారనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలింది.