హైదరాబాద్‌లో ఆదివారం ‘సరిలేరు నీకెవ్వరు’ ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు కొరటాల శివను మెగాస్టార్ చిరంజీవి ‘మర్యాదగా ఉండద’ని హెచ్చరించారు. ప్రత్యక్షంగా వందలాది మంది , టీవీల్లో లక్షలాది మంది లైవ్‌లో వీక్షిస్తున్న వేడుకలో చిరంజీవి దర్శకుడిని సినిమా చిత్రీకరణ టైం విషయమై ఇలాంటి హెచ్చరిక చేశారు. అయితే చిరంజీవి సరదాగా చేసిన ఈ హెచ్చరికను కొరటాల శివ నవ్వుతూ ‘సరేనంటూ’ తలూపాడు. ఇంతకూ అసలు విషయం ఏంటంటే…
‘సరిలేరు నీకెవ్వరు’ ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ మహేశ్‌బాబు నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ లాంటివి తీసుకోలేదని, సినిమా పూర్తయిన తర్వాతే తీసుకుంటారని తెలిసిందన్నారు. ఇది చాలా మంచి సంప్రదాయం అన్నారు. దీనివల్ల నిర్మాతలకి ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మిగులుతుందన్నారు. గతంలో తాను కూడా ఇలాంటి సంప్రదాయాన్ని అనుసరించినట్టు చిరంజీవి తెలిపారు. ఇప్పుడు తన కుమారుడు రాంచరణ్ కూడా సినిమా పూర్తయిన తర్వాతే నిర్మాతల నుంచి పారితోషికాన్ని తీసుకుంటున్నాడని తెలిపారు. మహేశ్‌బాబు ముందస్తుగా అడ్వాన్స్ తీసుకోకపోవడం వల్ల నిర్మాతలకి వెన్నుదన్నుగా నిలిచినట్టైందన్నారు. నిర్మాత అనిల్ సుంకర చాలా సంతోషించి ఉంటాడన్నారు.
అలాగే చాలా తక్కువ సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీశారని తెలిసిందన్నారు. ఇది కూడా మంచి వాతావరణమే అన్నారు. ‘ఏంటి మన పరిస్థితి’ అని తనతో సినిమా తీస్తున్న కొరటాల శివను ప్రశ్నించినట్టు తెలిపారు. సహజంగా ఆయన కూడా 130-150 రోజులు సినిమా తీసేందుకు సమయం తీసుకుంటాడన్నారు.
‘సార్ మీరు టైం అంటే టైంకు వచ్చే మనిషి. 7 గంటలంటే 7… 9 గంటలంటే 9కే వచ్చే మనిషని, కావున మీతో 80 నుంచి 99 రోజుల్లో పూర్తి చేస్తాను. 100 రోజులు తీసుకోను’ అని తనతో కొరటాల శివ అన్నాడంటూ… ‘ఎక్కడ శివా’ అని చిరంజీవి స్టేజీపై ఆరా తీశారు. ఈలోపు చిరంజీవి దగ్గరికి నవ్వుతూ కొరటాల శివ వచ్చారు.
‘పబ్లిక్‌లో కమిట్ అవుతున్నా శివ. 99 (రోజులు) మించిందా మర్యాదగా ఉండదు’ అని ‘చిరు’దరహాసంతో కొరటాల శివను దగ్గరికి తీసుకుని మరీ హెచ్చరించారు. 99 రోజుల్లోనే సినిమా తీస్తానంటూ కొరటాల శివ తలూపుతూ అందరి ముందు మరోసారి కమిట్ అయ్యారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవితో 152వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.