మనుషులకు గుండెపోటు రావడం రావడం సహజం. రోజూ పత్రికల్లో ఫలానా వారు గుండెపోటుకు గురయ్యారనే వార్తలను చదువుతుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని జర్నలిజం గుండె పోటుకు గురైంది. ఆధిపత్య సామాజికవర్గం చేతిలో ఉన్న మీడియా మనుషులందరినీ సమానంగా చూసే లక్షణాన్ని కోల్పోయింది. దీనికి నిదర్శనమే రైతు మరణంపై ఆ మీడియా సంస్థలు ఇచ్చిన ప్రాధాన్యం. రాజధాని రైతు గుండె పోటుతో మరణిస్తే మెయిన్ ఫస్ట్ పేజీలో చోటు కల్పించిన ఆ మీడియా, అదే రాయలసీమ, మరో ప్రాంతానికి చెందిన రైతులు అప్పులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడితే లోపల పేజీల్లో ఎక్కడో మామూలు విషయంగా ప్రచురిస్తున్నారు.
గత నెల 17న అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానులపై ఓ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజు నుంచి రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. దీనిపై ఆధిపత్య సామాజికవర్గ కబంధ హస్తాల్లో బందీ అయిన మీడియా ఉన్నదానికంటే పదింతలు రెట్టింపు చేస్తూ కథనాలను ప్రచురిస్తూ, పే…ద్ద ఉద్యమమేదో జరుగుతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన రాజధాని రైతు కొమ్మినేని మల్లికార్జునరావు (55) గుండెపోటుతో మరణించారు. మనిషి చావు ఎవరిదైనా, ఎక్కడైనా చింతించాల్సిందే. అందులో రెండుమాటకు తావులేదు. చావును కూడా హర్షించేవారెవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్లను మనుషులుగా జమకట్టలేం.
ఇదే రాజధాని రైతులు ఆందోళనబాట పట్టినప్పటి నుంచి ఏపీలో ఆంధ్రజ్యోతి లెక్కల ప్రకారం తొమ్మిది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక, వాటిని తీర్చే మార్గం కనిపించక పోవడంతో చావును శరణుకోరారు. కేవలం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం. వీరిలో ముగ్గురు కౌలు రైతులున్నారు.
రాజధాని రైతు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చనిపోయిన వార్తల వివరాలను ఆంధ్రజ్యోతి ఎలా రాసిందో చూద్దాం.
‘జగన్‌ను నమ్మి రోడ్డు పాలయ్యాం’ శీర్షికతో మొదటి పేజీలో రాజధాని రైతు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన వార్తను ఇచ్చారు. దీని కొనసాగింపు వార్తను 11వ పేజీలో ‘ఆగిన రాజధాని గుండె’ శీర్షికతో ఇచ్చారు.
వార్త ఇలా …
‘మల్లికార్జునరావు దొండపాడులో తనకున్న ఎకరం ఇరవై సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చాడు. వడ్డమాను రెవెన్యూలో ఇంకో నాలుగెకరాల పొలం ఉంది. శుక్రవారం ధర్నా అనంతరం ఆ పొలం వద్దకు వెళ్లి చూసి ఇంటికి వచ్చాడు. టీవీలో వార్తలు చూస్తూ తమ పొలం ధరలు పూర్తిగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల భవిష్యత్ కోసం రాజధానికి భూములిచ్చాం.. ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని చెప్పాడు. మనం నమ్మి ఓట్లు వేసిన జగన్ వలన రోడ్డున పడుతున్నామంటూ హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడాడు. అలా మాట్లాడుతుండగానే గుండెపోటు వచ్చింది’
రాజధాని మినహా మిగిలిన ప్రాంతాల్లోని రైతుల ఆత్మహత్యపై ఇలా…
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున(48) పంటల సాగుకు దాదాపు రూ.10 లక్షలు అప్పుచేశాడు. అప్పు తీర్చే మార్గంలేక మనస్తాపంతో మంగళవారం రాత్రి (డిసెంబర్ 18న) పొలంలోనే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అలాగే అదే జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన దొమ్మర చిన్న ఓబుళపతి(68) సాగు కోసం అప్పులుచేశాడు. తాను అనారోగ్యానికి గురి కావడం, భార్య లక్ష్మీదేవి కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్సల కోసం చేసిన అప్పుతో కలిపి దాదాపు రూ.7 లక్షలు కావడంతో మానసిక వేదనతో ఈ నెల 12వ తేదీ ఇంట్లోనే పురుగులమందు సేవించడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
కంబదూరు/బ్రహ్మసముద్రంలలో:
అప్పుల బాధతో అనంతపురం జిల్లాలో మంగళవారం (డిసెంబర్ 24న) ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కంబదూరు మండల కేంద్రంలోని మారెమ్మగుడి కాలనీకి చెందిన రైతు జి.బలరామ్ యాదవ్(47) ఆరెకరాల భూమిలో పంటల సాగుకు సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. అటు పంటలు చేతికిరాక, బోర్లలో నీరు ఇంకిపోవడంతో రుణదాతల ఒత్తిళ్లు అధిక మై బహిర్భూమికి వెళ్లి పురుగులు మందు తాగి ప్రాణాలొదిలాడు. అలాగే బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లికి చెందిన రైతు కురుబ కరేగౌడ్(45) తన నాలుగున్నర ఎకరాల పొలంలో పంటల సాగుకు రూ.8 లక్షల అప్పు చేశాడు. పంట చేతికిరాక పోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
ధర్మవరంలో..
అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని కొత్తచెరువుకు చెందిన సమిటి రామకృష్ణ (48) నాలుగు ఎకరాల పొలంలో పంటల సాగుకు సుమారు రూ.4 లక్షలు అప్పుచేశాడు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. డిసెంబర్ 29న గ్రామ సమీపంలో ఓ పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న రామకృష్ణను రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పులు తీర్చలేదనే దిగులుతోనే ఈ అఘాయుత్యానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలో…
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి నర్సిరెడ్డి తన నాలుగెకరాల పొలంతో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. వరుస నష్టాలతో దాదాపు రూ.11లక్షలు అప్పుచేశాడు. అప్పుతీర్చే మార్గంలేక బుధవారం (డిసెంబర్ 18న) ఇంట్లోనే నర్సిరెడ్డి పురుగుమందు తాగి మృతిచెందాడు.
రెంటచింతలలో కౌలు రైతు…
గుంటూరుజిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో డిసెంబర్ 28న ఓ కౌలు రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దవటం శ్రీనివాసరెడ్డి(42) తన రెండెకరాల పొలంతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చిని సాగు చేశాడు. అయితే దిగుబడి లేకపోవడంతోపాటు రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో శ్రీనివాసరెడ్డి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నెల్లూరు జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు…
డిసెంబర్ 22న నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బి.ఆగ్రహారానికి చెందిన కాసా యల్లారెడ్డికి రెండెకరాల పొలం ఉంది. గడిచిన నాలుగేళ్లలో సరైన వర్షాలు కురవక పొలంలోని బోర్లు వట్టిపోయాయి. ఏడాది క్రితం సంసారాన్ని ఉపాధి నిమిత్తం మర్రిపాడుకు మార్చాడు. ఇక్కడ రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. ఇక్కడా నష్టాలు రావడంతో చేసిన అప్పులు గుదిబండగా మారాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో శనివారం అగ్రహారానికి వచ్చిన యల్లారెడ్డి ఆదివారం తెల్లవారుజామున పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అలాగే కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన చంద్రాల విజయ్ (45) మూడేళ్లుగా జగన్నాథపురం, జుజ్జూరు శివారుల్లో సుమారు ఏడెకరాల మేర భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. సాగుకు రూ.4 లక్షల మేర అప్పులు చేశాడు. రెండేళ్ల నుంచి నష్టాలు రావటంతో పాటు ఈ ఏడాది కూడా అప్పులు తీరే అవకాశం లేకపోవటంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజధాని , మిగిలిన ప్రాంతాల్లోని రైతుల చావుకు తేడా ఏంటంటే…
ముందుగా రాజధాని రైతు మల్లికార్జునరావు విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రకారం టీవీలో వార్తలు చూస్తూ తమ పొలం ధరలు పూర్తిగా పడిపోతున్నాయని ఆయన ఆవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాలు కోల్పయాడు. అంటే భూముల రేట్లు తగ్గి సంపాదన తగ్గిపోతుందనే బెంగ ఆయన ప్రాణాలను తీసింది.
మిగిలిన ప్రాంతాల్లోని రైతుల ఆత్మహత్యల వార్తలను బాగా పరిశీలిస్తే…పంటల సాగుకు ఒక్కొక్కరు రూ.7 లక్షలు, రూ.10 లక్షలు అప్పులు చేయడం, పంటలు పండకపోవడం, అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక ఆత్మహత్యే శరణ్యమని బలవన్మరణానికి పాల్పడడాన్ని గమనించవచ్చు. అక్కడి రైతులది సహజ మరణం కాదు. అక్కడి రైతులది ఆకలి బాధ. అదే సాగునీటి సౌకర్యం రైతులది అజీర్తి బాధ. ఈ రెండింటికి చాలా తేడా ఉంది.