ఏ ఆవేశంలో ఉన్నాడో, ఏ మూడ్ లో ఉన్నాడో గానీ.. పవన్ కల్యాణ్ ఒక సీక్రెట్ ను బందరు బహిరంగ సభ వేదికగా బయటపెట్టారు. అదే తన రెమ్యునరేషన్ సంగతి. సాధారణంగా పెద్ద హీరోలు ఏరియాలు తీసుకునే దశ దాటిపోయి.. సాలిడ్ గా పదుల కోట్లు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలుసు.
పవన్ కల్యాణ్ కూడా ఒక్కో సినిమాకు 70 నుండి 80 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే చిన్న పాత్రలు చేసినప్పుడు రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నారని కూడా ఇండస్ట్రీలో అంటుంటారు. కానీ లీడ్ రోల్ చేస్తూ ఎక్కువ రోజులు షూటింగ్ ఉండేట్లయితే.. ఒక మొత్తం మాట్లాడుకుంటారు తప్ప.. రోజువారీ ఇవ్వరు. రోజువారీ రెండేసి కోట్లు ఇస్తూ పోతే.. నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకుని పోవాల్సిందే.
కానీ.. పవన్ కల్యాణ్.. బందరు సభలో తన రెమ్యునరేషన్ బయటపెట్టారు. తాను ఒక్కో సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయల వంతున తీసుకుంటున్నానని, ఇరవైరోజులు అలా షూటింగ్ చేస్తే నలభై అయిదు కోట్ల రూపాయలు తనకు రెమ్యునరేషన్ ఇస్తారని ప్రకటించారు.
రాజకీయ సభలో సినిమా రెమ్యునరేషన్ గొడవెందుకు వచ్చిందా అనుకుంటున్నారా? అదీ డబ్బు గురించే. తనకు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ప్రచారం జరిగిందని.. తనకు డబ్బు తీసుకోవాల్సిన ఖర్మ లేదని.. తన సంపాదన ఇలా ఉన్నదని.. అంటూ ఆయన రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్న సీక్రెట్ ను బయటపెట్టారు.
పవన్ కల్యాణ్ అసలు సంగతి బయటపెట్టారు.. మరీ ఈ మాటను ఇన్ కం ట్యాక్స్ వారు వింటున్నారా? అనేది ముఖ్యం. ఎందుకంటే, సగటు మనిషి జీవితాల్లో వేల రూపాయల్లో తేడాలొస్తే వందల మెసేజీలతో వెంటబడి కట్టించుకుంటారు. లక్షల్లో తేడాలొస్తే.. ఇళ్ల మీదకు దాడులు చేస్తారు. మరి పవన్ కల్యాణ్ ఐటీ చెల్లింపులు రెగ్యులర్ గా ముందే కడతారు. అది ఓకే . కానీ.. ముందు కట్టడం ద్వారా మభ్యపెడుతున్నారా.
సినిమాకు 45 కోట్ల వంతున వసూలు చేస్తున్నట్టు వారికి లెక్కల్లో చూపిస్తున్నారా? లేదా? అనేది గమనించాలి. లేదా ఆయన బిజెపి చంక ఎక్కి వారితో పొత్తుల్లో ఉన్న రాజకీయాలు చేస్తున్నారు గనుక.. ఆయన ఒక్కో సినిమాకు 45 కోట్లు దండుకుంటున్నా.. చూసీ చూడనట్టుగా ఐటీవారు కూడా ఆయనకు తోడ్పాటు అందిస్తారా? అనేది సామాన్యులకు అర్థం కాని సంగతి.