పవన్ కల్యాణ్ ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ అర్హతతో నిమిత్తం గానీ, అవసరం గానీ లేకుండా పెద్ద సినిమా హీరో అయ్యారు. ప్రతి సినిమాకు ఇరవై ముప్ఫయి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. నిర్మాతల నెత్తురు పిండి మరీ వసూలు చేస్తారు. కులాలు లాంటి చెత్తాచెదారం మొత్తం పక్కన పెట్టండి. సమాజంలో రెండే కులాలు. కడుపు నిండిన కులం. కడుపు ఎండిన కులం.
ఆయన కడుపునిండిన కులానికి చెందిన వ్యక్తి. కవిత్వం ఆయనకు అద్భుతమైన వస్తువుగా కనిపించడంలో వింత లేదు. కవిత్వం మోజు ఉండడం విశేషం కాదు. కానీ.. కడుపు ఎండిన కులానికి చెందిన వేలాది మంది.. ఆయన మీద ఒక నమ్మకంతో, ఆయన ఏదో ఒరగబెడతారనే ఆశతో బహిరంగసభకు వస్తే.. వారందరికీ ఆయన కవితాపఠనం వినిపిస్తే ఎలా?
కవిత్వం అనేది పవన్ కల్యాణ్ కు పైత్యంలా ముదిరిపోయింది. గుర్రం జాషువా దగ్గరినుంచి, శ్రీరంగం శ్రీనివాసరావుని, గుంటూరు శేషేంద్ర శర్మని, తెలంగాణ జనం ఫీలవకుండా గోరటి వెంకన్న ని అందరినీ ఆయన గుర్తు చేసుకుని వారి కవితలన్నింటినీ బందరు సభలో జాగ్రత్తగా చదివి వినిపించారు. ఆయనకేదో వారి కవిత్వం చదవడం మోజు అని అనుకుందాం.. కనీసం జాగ్రత్తగా ప్రిపేర్ అయి రావాల్సింది. ఎంతో పాపులర్ అయిన గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతోందో..’ అనే కవితను చదవడానికి కూడా పదంపదానికి తడబాటు. ఎందుకొచ్చిన పైత్యం ఇదంతా!
జగన్ ను తిట్టడం ఆయన ఎజెండా? తిట్టేసి పోవచ్చు కదా! ఏదో కులాల పాట పాడుతూ.. అన్ని కులాలను నేను సమానంగా ఉద్ధరిస్తానని అనడం ఆయన కోరిక. ఆ కులాల పాట పాడేసి పోవచ్చు కదా..!
ఉపన్యాసాలను సరిగా ప్రిపేర్ కాలేక.. చూసి చదవడంలో తడబడుతూ.. ఒక్క కులం చేతిలో రాష్ట్ర అధికారం ఉండడానికి వీల్లేదని పదేపదే వక్కాణిస్తున్న ఈ పవర్ స్టార్.. కనీసం ఆ కులాల పేరు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. అన్ని కులాలకు అధికారం దక్కాలంటున్న ఆయన, జనసేనను గెలిపిస్తే ప్రతి కులానికి ఒక నెల రోజులు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలనుకుంటున్నారో ఏంటో అర్థం కాదు.
కనీసం తాను ఉద్ధరించదలచుకున్న కులాల పేర్లు కూడా ఆయనకు తెలియదు. తెలియకపోవడం తప్పదు కాదు.. కనీసం ప్రిపేర్ కాలేదు. కాగితం మీద చూసి చదవడానికి కూడా ఆ కులం పేర్లు ఆయనకు నోటికి రావడం లేదు. ఆయనేమో ఉద్ధరించేస్తానని అంటున్నారు. బందరులో పవన్ ప్రసంగం.. పైత్యం ప్రకోపించినట్టుగా సాగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.