ఫైనల్ వార్నింగ్.. మారినా మారకున్నా వేటు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత కొందరు మంత్రులకు ఒక వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరును గమనిస్తున్నానని, పని తీరు మెరుగు పరచుకోకుంటే ఊరుకునేది లేదని, సమర్థతకు మాత్రమే పెద్దపీట అని, ఒకరిద్దరు…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత కొందరు మంత్రులకు ఒక వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరును గమనిస్తున్నానని, పని తీరు మెరుగు పరచుకోకుంటే ఊరుకునేది లేదని, సమర్థతకు మాత్రమే పెద్దపీట అని, ఒకరిద్దరు మంత్రులను మార్చడానికి వెనుకాడేది లేదని.. ఇలా రకరకాల మాటలు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. 

మంత్రులకు ఇది సీఎం నుంచి ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంలో వార్నింగులేం లేవు. ఇది ఉద్వాసన గురించి ముందుగా తెలియజెప్పడం మాత్రమే. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనే సమయానికి కులాల సమతూకం పరంగా.. అన్ని వర్గాలను అందలం ఎక్కించిన నాయకుడిగా ప్రజల ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. ఆ మేరకు కొత్తగా ఎమ్మెల్సీలు అవుతున్న వారిలో ఇద్దరు ముగ్గురికి మంత్రి బెర్తులు దక్కనున్నాయి. ఆ మేరకు కేబినెట్లో ఖాళీలు క్రియేట్ చేయాల్సి ఉంది. 

ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఎవరెవరిని తొలగించాలనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తానేటి వనిత, సీదిరి అప్పలరాజు వంటి వాళ్లు ఇప్పటికే తమ పదవులు పోతాయని మానసికంగా సిద్ధమైనట్లే మాట్లాడుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కేబినెట్ కూర్పు సమీకరణల దృష్ట్యా ఎవరెవరు అవసరమో.. దానికి తగినట్టుగా ఎవరెవరి మీద వేటు పడుతుందో అర్థం కాని సంగతి.

ఎటూ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్నది గనుక.. కేవలం కొన్ని కుల సమీకరణల కోసం మాత్రమే కాకుండా.. మరో కోణంలో కూడా జగన్ దీనిపై దృష్టి పెడితే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేబినెట్లోని కొందరు మంత్రులు అడ్డగోలు అవినీతి ఆరోపణలతో భ్రష్టుపట్టిపోయారు. ప్రభుత్వాన్ని కూడా భ్రష్టు పట్టించారు. అలాంటి వారి మీద కూడా జగన్ వేటువేస్తే పార్టీకి మేలు జరుగుతుంది. 

కేవలం కులాల తూకం పాటించడం మాత్రమే కాదు. అవినీతిని కూడా జగన్ సహించడని.. అలాంటి వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. జగన్ తదనుగుణంగా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీని మరింత వైభవ స్థితికి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది.