రాజధాని భూముల వ్యవహారంలో నిన్న హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామం భవిష్యత్‌లో కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు మాజీ తహశీల్దార్‌పై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాన ప్రతి పక్ష పార్టీ తమకు డేంజర్ బెల్ మోగుతున్నట్టే అనే అభిప్రాయానికి వచ్చింది.
ఎందుకంటే ఇప్పటికే పలువురిపై రాజధాని భూముల కొనుగోలుకు సంబంధించి సీఐడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, దానిపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే భూముల వ్యవహారంలో ఒక దానిపై సీఐడీ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, మరో అవినీతి వ్యవహారంలో ఎందుకు ఇవ్వరనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో డేంజర్ బెల్ మోగుతున్నట్టే అనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.
అమరావతిలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టడంలో నాటి తుళ్లూరు తహసీల్దార్ అన్నె సుధీర్‌బాబు కీలక పాత్ర పోషించాడు.
అక్రమాలకు పాల్పడిన సదరు సుధీర్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే తనపై సీఐడీ దర్యాప్తు నిలిపివేయాలంటూ సుధీర్‌బాబు గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. ఆయనకు అనుకూలంగా హైకోర్టు సీఐడీ దర్యాప్తుపై స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులో హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయమై వారంలో తేల్చాలని హైకోర్టును ఆదేశిస్తూ, మరోసారి అక్కడికే వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సీఐడీ దర్యాప్తు జరగాల్సిందేనని ఆదేశించారు.
అంతేకాదు, దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేయడం గమనార్హం. దీంతో సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగం పుంజుకోనుంది. ఈ దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాలు తమకెక్కడ చుట్టుకుంటాయోననే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది.
మరీ ముఖ్యంగా మాజీ అడ్వొకేట్ జనరల్‌తో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలపై కూడా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానిపై రాత్రికి రాత్రి స్టే తెచ్చుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం తుళ్లూరు మాజీ తహశీల్దార్‌పై సీఐడీ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో …మరి వాళ్లపై ఎందుకు విచారణ జరపకూడదనే ప్రశ్న సమాజం నుంచి తప్పక వస్తుంది. అందులోనూ చట్టం అందరికీ సమానం కాబట్టి …వాళ్లపై కూడా విచారణకు న్యాయస్థానం ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదే జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై రాజకీయ విశ్లేషకులు, మేధావులు, విద్యావంతులు ఇప్పటి నుంచే ఒక అంచనాకు వస్తున్నారు. చూద్దాం కాలం ఎన్ని విచిత్రాలను సృష్టిస్తుందో!