అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి మళ్ళీ పెద్ద నోరు చేస్తున్నారు. ఉత్తరాంధ్రా ప్రజలు విశాఖ రాజధానికి వ్యతిరేకం అన్నట్లుగా అచ్చెన్న మాట్లాడుతున్నారు. తాము అమరావతి మన రాజధాని అని ఎన్నికలకు వెళ్తే ఆరు సీట్లు ఇచ్చారని కూడా చెబుతున్నారు.
మరి ఇందులో లాజిక్ ఏముందో అచ్చెన్నాయుడే చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో మొత్తం 34 సీట్లకు గానూ ఆరంటే ఆరు టీడీపీ గెలిచింది అంటే ప్రజలు ఆ పార్టీ వెంట లేనట్లే కదా. అయినా ఆరు సీట్లు గెలిచామని తమ పక్షమే ఉత్తరాంధ్ర జనం అని ఆయన కొత్త పెత్తందారు హోదాలో మాట్లాడుతున్నారు.
విశాఖను రాజధానిగా పేర్కొంటూ ఉత్తరాంధ్రాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలట. వారితో పాటే తామూ చేస్తామని, అపుడు ప్రజలు ఎవరి పక్షం ఉన్నారో తేలుతుందని వింతైన సవాల్ చేశారు అచ్చెన్న.
ప్రజలు ఏడాదిన్నర క్రితం ఎవరేంటి అన్నది తేల్చారు కదా. అయినా డౌట్ ఉంటే మీకు మీరే రాజీనామాలు చేసుకోండి అంటున్నారు మంత్రి సీదరి అప్పలరాజు. విశాఖ రాజధాని వద్దు అని మీరు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే జనం మీకు ఎలా చెప్పాలో అలా చెప్పి తీర్పు ఇస్తారంటూ అప్పలరాజు పంచ్ డైలాగులే పేల్చారు.
తెలంగాణా కావాలి అన్నపుడు టీఆర్‌ఎస్ వారు పదే పదే రాజీనామాలు చేశారు. అమరావతి ఏకైక రాజధాని అని కోరుతున్నది మీరు కాబట్టి రాజీనామా చేయాల్సింది కూడా మీరే అంటూ అచ్చెన్నకు గట్టి కౌంటరే ఇచ్చేశారు. మొత్తానికి శుభమా అని పనిమొదలెడుతూ రాజీనామాల గోల ఏంటి అచ్చెన్నా అని తమ్ముళ్ళే సణుక్కుంటున్నారుగా.