అమరావతికి పునాదులు వేసి ఐదేళ్లు గడిచాయట… శంకుస్థాపన జరిగి ఐదేళ్లు అయ్యాయట.. అయితే నాటికీ, నేటికీ పరిస్థితి తేడా లేదట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు వల్ల అమరావతి దుంపనాశనం అయ్యిందట.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందట.. శంకుస్థాపన రోజున నాటి, నేటి ప్రధానమంత్రి మోడీ, నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. అమరావతి గొప్ప నగరం ఎదుగుతుందని స్పష్టంగా చెప్పారట.
అలాగే సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి ఒకరు.. అమరావతి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్నారట. రైతులకు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇచ్చిందట!
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాకా అమరావతి అధ్వాన్నం అయిపోయిందట, మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి ఎదుగుదలకు ఆటంకంగా మారిందట, అలాగే అమరావతికి వరదలు వస్తాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే వ్యాఖ్యానించారట.
దీంతో ఐదేళ్లు అయినా అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందట! ఇది ఈనాడు వారి బాధ!
అనునిత్యం అమరావతి మీదే ఏదో ఒక కథనాలను ఇచ్చి, తమ ప్రయోజనాలు ఏమిటో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా స్పష్టంగానే చెబుతోంది. అమరావతి ఆందోళనలు అంటూ ఏడాదిగాకే ప్రతి రోజూ ఒకటే కథ. మళ్లీ ఇలాంటి వార్షికోత్సవాలు, శతదినోత్సవాలు వేరే!
అమరావతి కి వరదలొస్తాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే వ్యాఖ్యానించారట.. అందుకే ఆ ప్రాంతం అభివృద్ధి కాలేదట.. ఎవరో ఏదో అంటే కాదు, వాస్తవం ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ప్రస్తుత వర్షాకాలంలో.. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్మితమైన తాత్కాలిక భవనాల పరిసరాల పరిస్థితి ఏమిటో ఈనాడు కవర్ చేయదు! అయినా.. అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు అవుతోందని అంటున్నారు కదా, అందులో నాలుగేళ్లు చంద్రబాబు నాయుడి పాలనే ఉంది కదా?
అంటే.. నాలుగేళ్లూ ఏం చేసినట్టు? అనే ప్రశ్నను అడగాల్సింది చంద్రబాబు నాయుడినే! నాలుగేళ్లు స్కెచ్ లు, ప్లాన్లు గీయడానికే సమయం సరిపోలేదు.
కట్టిన తాత్కాలిక సచివాలయం పరిస్థితి ఏమిటో జగద్విఖ్యాతం! అలాంటప్పుడు అమరావతి గురించి తెగబాధపడిపోయిన ఈనాడు ప్రశ్నించాల్సింది చంద్రబాబునే! కట్టుకథలు చెప్పారు, విదేశాలు తిరుగుతూ జనాలను వెర్రివాళ్లుగా చేశారు.. అనే అంశాల గురించి చంద్రబాబును పచ్చమీడియా నిలదీయాలి!
ఇక మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి పాలిట శరాఘాతంగా అభివర్ణించడంలో ఈనాడు ఉద్దేశం ఏమిటి? మిగతా ప్రాంతాలు ఏమైనా అయిపోవచ్చు, అమరావతి మాత్రం ప్రజల సొమ్ముతో ఉద్ధరింపబడాలి అనేనా? .
అలాంటప్పుడు ఈనాడు కాపీలను కూడా అమరావతిలోనే అమ్ముకోవాలి, మిగతా ప్రాంతాలు అన్యాయం అయిపోయినా ఫర్వాలేదు, అమరావతి మాత్రమే చాలు అనే బరితెగింపు ఆఖరికి మీడియా వర్గాల నుంచి కూడా స్పష్టం అవుతూ ఉండటం విచారకరం.
తమ ఉద్దేశాలను, తమ ప్రయోజనాలను పచ్చిగా బహిరంగ పరుస్తూ అంతిమంగా ఏం సాధిస్తున్నట్టో పచ్చవర్గాలు ఎక్కడో ఒక చోట సమీక్షించుకునే పరిస్థితి ఉండదా?