తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మరోసారి ఉల్లి ఘాటెక్కింది. రేటు అమాంతం పెరిగింది. మార్కెట్లో మొన్నటివరకు కిలో 25 రూపాయలు మాత్రమే ఉన్న ఉల్లి రేటు ఒక్కసారిగా పెరిగి 75 రూపాయలకు చేరుకుంది. బుధవారం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కిలో 84 రూపాయలకు కూడా అమ్ముడుపోయింది.
మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోనీ నిల్వ ఉన్న ఉల్లిని మార్కెట్లోకి వదిలి ధరల్ని స్థిరీకరిద్దామంటే.. వరదలకు గోడౌన్స్ లో నిల్వ ఉంచిన ఉల్లి దాదాపు 40శాతం మేరకు కుళ్లిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగే ప్రమాదం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు. ఉల్లి రేటు మరోసారి కిలో 150 రూపాయల్ని తాకడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
అటు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఖరీఫ్ ముగిసేనాటికి దేశీయ ఉల్లి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఈ లోగా విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేలా నిబంధనల్ని సడలించింది.
దిగుమతి చేసుకునే దేశాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అయితే కేంద్రం ఈ విషయంలో చాలా ఆలస్యం చేసింది. ఈ నెల ప్రారంభంలోనే చర్యలు చేపట్టాల్సింది పోయి.. ఇప్పుడు అనుమతులివ్వడం విమర్శలకు తావిస్తోంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడతారనేది చర్చనీయాంశమైంది. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు జగన్ సర్కార్.. కేవలం కిలో 15 రూపాయలకే ఉల్లి సరఫరా చేసింది.
రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో నిల్వలు పెంచి, మార్కెట్ రేటు 70 రూపాయలు ఉన్న టైమ్ లో 15 రూపాయలకే ఉల్లిని విక్రయించింది. అయితే ఈసారి భారీ వర్షాలు, కేంద్ర నిబంధనల కారణంగా రాష్ట్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇటు తెలంగాణలో పరిస్థితి మరింత దారణంగా ఉంది. ఉల్లి దిగుమతుల కోసం ఎక్కువగా మహారాష్ట్రపై ఆధారపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు కూడా లేకపోవడంతో.. తెలంగాణ ప్రజానీకం మరోసారి ఉల్లిదెబ్బను చవిచూడక తప్పని పరిస్థితి.