కొన్ని విషయాల్లో గతంలో ఏ పాలకులు చేయని విధంగా జగన్ సర్కార్ చేస్తోందనే క్రెడిట్ జగన్ సర్కార్ దక్కించుకుంటోంది. ఇదే సమయంలో ఏంటిది? ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తోందనే అసహనాన్ని కూడా జగన్ సర్కార్ సొంతం చేసుకుంటోంది.
ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఈయన విషయంలో జగన్ సర్కార్ బ్యాలెన్స్ తప్పుతోందనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఎదురవుతున్నాయి.
ఇక్కడ జగన్ సర్కార్ చిన్న లాజిక్‌ను, విచక్షణను మిస్ అవుతోందనే భావన మెజార్టీ ప్రజల్లో కలుగుతోంది. ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రూ.40 లక్షలకు రూ.36 వేలు తగ్గించి ఎస్ఈసీ ఖాతాలో జమ చేసింది.
ఎటూ ఈ రోజు కాకపోతే రేపు అయినా ఎస్ఈసీ ఖాతాకు నిధులు జమ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు దాదాపు ఏడాదిగా నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ… చివరికి హైకోర్టు వరకూ వెళ్లే పరిస్థితి తెచ్చుకోవడం, అక్కడ అనవసరంగా మాట పడాల్సి రావడం …ఇవన్నీ స్వీయ తప్పిదాలే తప్ప మరెవరినో నిందించడం అనవసరం.
మరీ ముఖ్యంగా జడ్జిలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చెప్పమంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నించడం, రాజ్యాంగ వ్యవస్థ ప్రతిదానికి మిమ్మల్ని యాచించాలా అని కోర్టు ప్రశ్నించే పరిస్థితికి తెచ్చుకోవడం జగన్ సర్కార్ కోరి కోరి తెచ్చుకుంటున్న తగువుగానే భావించాలి.
ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదుకు సంబంధించి పత్రాలను మీడియాకు వెల్లడిం చడం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ విషయంలో వైఎస్ జగన్‌కు దేశ వ్యాప్తంగా అనూహ్యమైన మద్దతు లభించింది.
న్యాయ వ్యవస్థ అంటే ఒక రకమైన భయం మనల్ని ఆవహించింది. అందరూ భయపడే వ్యవస్థతో ఢీకొట్టిన జగన్ అంటే దేశం దృష్టిలో ఓ హీరో అయ్యారు. ధిక్కరణకు ఉన్న ఆకర్షణ, హీరోయిజం అదే. ఈ విషయంలో జగన్‌కు కలిసి వచ్చిన అంశాలు అవే.
మన కంటే పెద్ద వ్యవస్థలతో ఢీకొట్టే వాళ్లంటే సహజంగానే మన సమాజానికి మోజు ఎక్కువ. అలాంటి వారి పట్ల గౌరవం, అభిమానం వెల్లువెత్తుతాయి. న్యాయ వ్యవస్థతో ఢీకొడుతున్న జగన్‌కు సమాజం నుంచి అలాంటి గౌరవమే దక్కింది. కానీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి చిన్నపాటి వ్యక్తులతో ముఖ్యమంత్రి తలపడాల్సిన అవసరం లేదనేది సొంతవాళ్లు కూడా చెబుతున్న మాట.
ఎందుకంటే ఏకంగా కాబోయే దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తితో ఢీకొడుతున్నాడని అభిమానిస్తున్న వాళ్లకు …నిమ్మగడ్డతో తలపడడాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఈ విషయంలో జగన్ సర్కార్ విచక్షణ కోల్పోయిందనే అభిప్రాయానికి రావడం అందుకనే.
కావున ఇప్పటికైనా జగన్ సర్కార్ కాస్తా విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద రౌడీలను చితక్కొట్టే అభిమాన హీరో …ఆకురౌడీలతో కయ్యానికి దిగితే ఏ అభిమాని మాత్రం జీర్ణించుకుంటాడు.