ఒకవైపు కరోనా పడగ నుంచి భారతదేశం పూర్తిగా బయటపడని పరిస్థితి. ప్రతి వారాంతంలోనూ షాపింగ్ మాల్స్ ను చుట్టేసి అవసరమైనవి, అవసరం లేనివి కొనే పరిస్థితి ఇంకా మామూలు కాలేదు. ఇలాంటి క్రమంలో పండగలు వచ్చాయి, అవసరాలు పెరిగాయి.
బయట తిరిగే వాళ్లు తిరుగుతున్నా, కొంతమంది మాత్రం ఇంకా ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ అవకాశాన్ని ఇ-కామర్స్ సైట్లు పుష్కలంగా ఉపయోగించుకుంటున్నాయి. పండగ వేళ ప్రత్యేక ఆఫర్లను పెట్టి.. కస్టమర్లను రెచ్చగొట్టాయి. అమెజాన్, ఫ్లిక్ కార్ట్.. మింత్రా ఇలా ఇ-కామర్స్ సైట్లన్నీ పోటాపోటీగా ఆఫర్లను ఇచ్చాయి. దీంతో వాటి ద్వారా భారీగా వ్యాపారం జరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
అమెజాన్- ఫ్లిప్ కార్ట్ ల ద్వారా దసరా- దీపావళి సీజన్లలో ఏకంగా కోటిన్నర స్మార్ట్ ఫోన్ యూనిట్లు అమ్ముడవుతున్నట్టుగా అంచనా! ఈ ఏడాది చివరకు మొత్తంగా ఐదు కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి! స్మార్ట్ ఫోన్ల కొనుగోలు ప్రజలకు అనునిత్య వ్యాపకంగా మారిన నేపథ్యంలో, కరోనా వేళ కొనుగోళ్లు కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి.
అమెజాన్-ఫ్లిప్ కార్టులు తమ ఆఫర్ల ఐదు రోజుల్లోనే ఏకంగా 22 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయట. దసరా, దీపావళి పండగలు పూర్తయ్యే సరికి మరింత భారీ వ్యాపారం జరుగుతుందని అంచనా. గత ఏడాది ఈ సీజన్ మొత్తానికీ 28 వేల కోట్ల రూపాయల స్థాయి వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఈ సారి ఆ వ్యాపార మొత్తం 50 వేల కోట్ల రూపాయల పై స్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి.
కరోనాతో ప్రజల కొనుగోలు సామర్థ్యం కొంత వరకూ తగ్గి ఉంది. అయినా ఆ ప్రభావం ఈ వ్యాపారాల మీద పెద్దగా పడినట్టుగా లేదేమో! ఇ-కామర్స్ సైట్లు చిన్న చిన్న పట్టణాలకు కూడా తమ డెలివరీ వ్యవస్థను విస్తరించాయి. ఈ నేపథ్యంలో కూడా వాటి వ్యాపారాలు మరింత విస్తృతం అవుతున్నాయి.