విజయశాంతి…పరిచయం అక్కర్లేని సినిమా నటి, రాజకీయ నాయకురాలు. మహిళలే కాదు మగవాళ్లు కూడా స్ఫూర్తిగా తీసుకునే అనేక పాత్రలను ఆమె పోషించారు. లేడీ అమితాబ్‌గా ఆమె పేరు పొందారంటే సినీ రంగానికి విజయశాంతి అందించిన సేవలు ఎంతో అమూల్యం. మొత్తానికి సినీరంగంలో ‘సరిలేరు నీకెవ్వరు’…అనే రీతిలో ఆమె సినీ, రాజకీయ ప్రస్థానం సాగింది.
19 ఏళ్ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’తో ఆమె తిరిగి సినీ రంగంలో పునః ప్రవేశించారు. ఈ సందర్భంగా విజయశాంతి తన వ్యక్తిగత, సినీ, రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆమె ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
అమ్మకు ఇష్టం లేదు
మా అమ్మకు నేను సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. అందరి తల్లుల మాదిరిగానే అమ్మ కూడా నా భవిష్యత్‌పై ఆలోచించింది. చక్కగా చదివించి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలని భావించింది. అయితే నాన్న ఆలోచన మరోలా ఉండింది. ఎలాగైనా నన్ను హీరోయిన్‌గా చూడాలనేది నాన్న ఆశయం. నాన్న ప్రోత్సహం, ప్రోద్బలంతోనే సినిమాల్లో అడుగు పెట్టాను. 13 ఏళ్ల వయస్సులో మొట్టమొదటగా భారతీరాజా దర్శకత్వంలో తమిళ సినిమాలో కెమెరా ముందు నిలబడ్డాను.
తెలుగులో కిలాడీ కృష్ణుడితో ప్రారంభం
ఎన్నోకట్టుబాట్ల మధ్య సినిమాల్లోకి వచ్చిన నా అసలు పేరు శాంతి. సినిమాల్లోకి రావడంతో అమ్మ నా పేరు ముందు విజయ కలిపింది. అలా విజయశాంతినయ్యాను. ఆ తర్వాత తెలుగులో మొట్టమొదట గుర్తించుకోవాల్సిన వ్యక్తి విజయనిర్మల. ఆమె దర్శకత్వంలో ‘కిలాడీ కృష్ణుడు’ అనే సినిమాలో నటించాను. అది 1979లో విడుదలైంది.
కెరీర్‌లో పతాకస్థాయికి తీసుకెళ్లిన సినిమా ఏదంటే…
నిజానికి నాకు సినిమా రంగం పూర్తిగా కొత్త. అందులోనూ కట్టుబాట్ల మధ్య పెరుగుతున్న జీవితం నాది. అందువల్ల గ్లామర్ పాత్రలంటే అసలు ఇష్టం ఉండేది కాదు. గ్లామర్ పాత్రలకు సంబంధించి వేషధారణ, అర్థంపర్థం లేని డ్యాన్స్‌లు నాకు అసంతృప్తి మిగిల్చేవి. మంచి ఆదర్శవంతమైన, సావిత్రి మాదిరిగా గుర్తుండిపోయే పాత్రల కోసం ఎదురు చూసేదాన్ని. వెతుకుతున్న కాలికి తగిలినట్టు మంచి పాత్రలు వచ్చాయి. ప్రతిఘటన, నేటి భారతం సినిమాలు పేరు తెచ్చాయి. ఇక కర్తవ్యం గురించి చెప్పనవసరం లేదు. నాకు హీరో ఇమేజ్ తెచ్చిన సినిమా అది. నా కెరీర్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఒసేయ్ రాములమ్మ అని చెప్పక తప్పదు.
సింఫుల్‌గా పెళ్లి
శ్రీనివాస ప్రసాద్‌తో పరిచయం ఎన్నడూ ఊహించలేదు. అంతే కాదు అనుకోని పరిచయం ఆయనతో ఏడడగులు నడుస్తానని కూడా అసలు ఊహించలేదు. ఆయనతో మాటలు కలవడం, అభిప్రాయాలు ఒకటే కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం, చేయడం కూడా నాకిష్టం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్నేహితుల సమక్షంలో సింఫుల్‌గా పెళ్లి చేసుకున్నాం. పెళ్లంటే పరస్పరం నమ్మకమనే మూడుముళ్ల బంధం. అదే మమ్మల్ని సంతోషంగా జీవించేలా చేస్తోంది.
పిల్లల విషయానికి వస్తే…
పిల్లలంటే ఇష్టం లేని వారెవరు? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అయితే మనిషిగా పుట్టిన తర్వాత లోకానికి ఏదైనా మనవంతుగా చేయాలనే ఆలోచన నాలో బలంగా ఉంది. పిల్లలుంటే వారికి సంపాదించాలనే స్వార్థం పెరుగుతుందని భావించాను. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మరింత బలపడింది.
రాజకీయాల్లో ‘నా’ అనే స్వార్థాన్ని విడిచిపెట్టి ‘మన’ అనే ధోరణితో కదలాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే సినిమాల్లో, రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అందుకు ప్రజలే కారణం. వారి కోసం జీవితాన్ని అంకితం ఇవ్వాలనుకున్నాను. నా ఆలోచనలకు మా వారు కూడా అంతే పెద్ద మనసుతో అంగీకరించారు. అందువల్లే పిల్లలు వద్దనుకున్నాం. సమాజంలోని ప్రతి ఒక్కరూ నా పిల్లలే. కష్టాల్లో ఉన్నవారికి మాతృహృదయంతో సేవ చేయడమే నా లక్ష్యం, లక్షణం. అలాంటప్పుడు సొంత బిడ్డలు లేరనే బెంగ ఎందుకు?