స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏ మాటకామాట చెప్పాలంటే … ఏపీ హైకోర్టు భలే చెప్పింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం హైకోర్టు విచారించింది.
ఎన్నికల సంఘానికి వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యతో నిమ్మగడ్డ ఆశించినట్టు హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిమ్మగడ్డకు నిరాశ కలిగించేదే అని అంటున్నారు.
విచారణలో భాగంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా హైకోర్లు కలగజేసుకుని ప్రతిదానికీ రాజ్యాంగ సంస్థ వచ్చి ప్రభుత్వాన్ని అడగాలా? అని ప్రశ్నించింది.
అలాగే ప్రభుత్వం ఏ విషయాల్లో సహకరించడం లేదో తెలపాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతానికి ఇంకా స్పష్టత రానట్టే.
ఎందుకంటే కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాత్రం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.