తను బతికున్న రోజుల్లో ఏనాడూ తన బంధువులుగా ఎవరినీ చేరదీయలేదు జయలలిత. ఆఖరికి ఎవరో అనామకుడిని దత్తతగా అయినా తీసుకుంది కానీ, తన రక్తసంబంధీకులెవరినీ జయలలిత దగ్గరకు తీసుకోలేదు.
అసలు జయలలిత యాక్టివ్ గా ఉన్నంత వరకూ ఆమె బంధువులంటూ ఎవరూ మీడియాకు కూడా ఎక్కింది లేదు! ఆఖరికి జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు దీప హాస్పిటల్ వద్దకు వచ్చి తను జయకు బంధువునంటూ చెప్పుకుంటే.. ఆమె చెప్పింది నమ్మింది కూడా తక్కువమందే! అప్పటికే జయ కూతురు, కొడుకు అంటూ కొంతమంది కోర్టులకు ఎక్కిన నేపథ్యంలో.. ఈ మేనకోడలు కూడా అలాంటి బాపతే అని కొంతమంది అనుమానించారు.
అయితే.. చివరకు దీప జయ మేనకోడలుగా, దీపక్ ఆమె మేనల్లుడిగా నిరూపించుకోగలిగారు. అది కూడా జయలలిత మరణించిన తర్వాతే! తన ఆస్తి విషయంలో కానీ, తన రాజకీయ వారసత్వం విషయంలో కానీ తన రక్తసంబంధీకులకు ఎలాంటి అవకాశాన్నీ ఇవ్వలేదు జయలలిత! అదంతా ఆమె బతికి ఉన్న రోజుల్లో.
జయలలిత ఎవరినైతే పూర్తిగా దూరం పెట్టిందో వాళ్లు ఇప్పుడు ఆమె ఆస్తికి హక్కుదారులు అవుతూ ఉండటం గమనార్హం. కోర్టు వాళ్లను పిలిచి మరీ ఆస్తులను అప్పగిస్తూ ఉంది! .
ఇటీవలే జయలలితకు సంబంధించిన కొన్ని వైట్ మనీ ఆస్తులకు దీప, దీపక్ లను వారసులుగా ప్రకటించింది మద్రాస్ హై కోర్టు. తాజాగా జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించిన డబ్బులను కూడా దీప, దీపక్ లు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది!
జయ నివాసాన్ని మ్యూజియంగానో, మరోలానో మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. అందు కోసం ఆ ఇంటిని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించి డబ్బును జమ చేసింది పళనిస్వామి ప్రభుత్వం. ఆ డబ్బులో కొంత మొత్తాన్ని పన్ను కింద ఐటీ శాఖ తీసుకోవాలని, అది పోగా మిగిలిన మొత్తాన్ని దీప, దీపక్ లు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది!
ఇలా దీప, దీపక్ లు వేద నిలయం డబ్బులను తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టే ఒత్తిడి చేసే పరిస్థితులు రావడం గమనార్హం!