వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకునే వార్త. జగన్ కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఇటీవల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రెండోసారి కరోనాబారిన పడ్డారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను హుటాహుటీన హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
కరోనా కారణంగా పలువురు ప్రముఖులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో వెల్లంపల్లి ఆరోగ్యం విషమించిందనే వార్తలతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మంత్రి త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు.
ఒక దశలో ఆయన ఆరోగ్యంపై రకరకాలు వచ్చిన వార్తలు తీవ్ర భయాందోళన కలిగించాయి. ఈ నేపథ్యం లో ఆయన కోలుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి మంత్రి వెల్లంపల్లి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి తన ఆరోగ్యం గురించి వెల్లడించారు.
విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నట్టు చెప్పారు. అనారోగ్యం బారిన పడిన సమయంలో అండగా నిలి చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మిత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో యధావిధిగా విధుల్లో భాగస్వామినవుతానని అన్నారు.