నిరంతరం జగన్, కేసీఆర్ లను విమర్శించడమే పనిగా ఉండేదాయనకు! ఆ తర్వాత చంద్రబాబు జిమ్మిక్కులతో ఆయన అడ్రస్ కోల్పోయాడు. కన్నీళ్లు పెట్టుకుని.. ఏడ్చి మరీ చంద్రబాబును తిట్టి వెళ్లిపోయారు! కట్ చేస్తే.. ఆ తర్వాత పచ్చమీడియా కూడా ఏనాడూ ఆయనను పట్టించుకున్నదీ లేదు! అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత.. మోత్కుపల్లి నర్సింహులకు పచ్చమీడియా మహా నేత హోదానిచ్చేసింది!
చంద్రబాబు అరెస్టు అయితే.. ఎవరో జాతీయ నేతలు, జాతీయ పార్టీల నేతలు రెస్పాండ్ కావాల్సింది పోయి, అలాంటిదేమీ అణుమాత్రమైనా లేకపోగా.. ఈ ఎపిసోడ్లో మోత్కుపల్లిని స్టూడియోలో కూర్చోబెట్టుకుని, ఆయనను వదలకుండా షోల మీద షోలు రన్ చేస్తూ.. పచ్చమీడియా చంద్రబాబు ధైన్య స్థితిని చాటుతూ ఉంది!
చంద్రబాబు అప్పట్లో ఏపీలో చిన్న పాటి దీక్ష చేసినా.. అజిత్ సింగ్ వచ్చేవాడు! ప్రకాష్ కారత్ వచ్చేవాడు. బీజేపీ ముఖ్య నేతలంతా స్పందించేవారు. దోస్తీగా ఉంటే! చంద్రబాబు మూడో కూటమి, నాలుగో కూటమి అనే సందర్భాల్లో ఎర్ర పార్టీ నేతలు, ఉత్తరాది ప్రాంతీయ పార్టీల నేతలు తెగ స్పందించేసే వారు!
ఇలాంటి వారినే అప్పట్లో ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి రాజకీయ వితంతువులు అంటూ ఒక వర్డ్ వాడారు! మరి ఆఖరికి అలాంటి రాజకీయ వితంతువులు కూడా ఇప్పుడు చంద్రబాబు కోసం స్పందించడం లేదు! కాంగ్రెస్ కూటమి వాళ్లు కానీ, బీజేపీ దోస్తులు కానీ.. చంద్రబాబును పట్టించుకున్నది లేదు! దీంతో దిక్కులేని వేళ మోత్కుపల్లి నర్సింహులే మహానేతగా మారాడు.
ఈయన గత ఎన్నికల్లో ఏపీలో జగన్ ను గెలిపించాడట, ఈయన చెప్పారని ఐదారు శాతం ఓట్లు ఏపీలో జగన్ కు పడ్డాయట! అలాంటాయనకు జగన్ పాలన నచ్చలేదుట, చంద్రబాబును జైలు పాల్జేయడం అక్రమం అట! అప్పట్లో జగన్ మద్దతు పలికినందుకు ఈయన పచ్చచానళ్లలో కూర్చుని పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారట! మరి చంద్రబాబు జైలు కెళ్లడం కాదు కానీ, ఇలాంటి వ్యవహారాలు పచ్చవర్గాల పతనావస్థను చాటుతూ ఉంది!