రేవంత్‌ రెడ్డి ఇంతగా దిగజారిపోయాడేమిటి?

ఈనాటి సమాజంలో అందరికంటే దిగజారిన వ్యక్తులు ఎవరంటే రాజకీయ నాయకులే. ఈ దిగజారిన రాజకీయ నాయకులు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కాదు. ఇతర రాష్ట్రాలవారి గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. మన తెలుగు…

ఈనాటి సమాజంలో అందరికంటే దిగజారిన వ్యక్తులు ఎవరంటే రాజకీయ నాయకులే. ఈ దిగజారిన రాజకీయ నాయకులు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కాదు. ఇతర రాష్ట్రాలవారి గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు మాత్రం అన్ని విధాల దిగజారిపోయి నేలబారు మనుషులైపోయారు. విలువల వలువలు ఏనాడో వదిలేశారనుకోండి.

ఏ రాజకీయ నాయకుడిని చూసినా నోటి కంపు భరించలేనంతగా ఉంది. అంటే పళ్లు సరిగా తోముకోక నోరు దుర్వాసన రావడం కాదులెండి. నోటికొచ్చినట్లు, ఇష్టమొచ్చినట్లు, అసభ్యంగా, అసహ్యంగా, మర్యాద మర్చిపోయి మాట్లాడుతున్నారు కదా. అందుకే నోరు కంపు కొడుతూ ఉంటుంది. 

గట్టిగా మాట్లాడటం వేరు, అసభ్యంగా అసహ్యంగా మాట్లాడటం వేరు. సీనియర్లు సైతం ఛండాలంగా మాట్లాడుతున్నారు కాబట్టే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా వారిని ఫాలో అవుతూ బయటనే కాదు, చట్టసభల్లో సైతం బూతులు మాట్లాడుతున్నారు.

చివరకు కొందరు థర్డ్‌ గ్రేడ్‌ నాయకులు టీవీ చర్చల్లో సైతం అలవోకగా బూతులు మాట్లాడుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విమర్శలకు, బూతులకు తేడా లేకుండా పోయింది. ఇందుకు ఆడ మగా తేడా కూడా లేదు. నాయకులతో పోటీపడి నాయకురాళ్లు సైతం ధారాళంగా తిట్లు లంకించుకుంటున్నారు. ఇలాంటి లిస్టు చెప్పుకోవాలంటే చేంతాడంత అవుతుంది. చివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన, ఇప్పుడు చేస్తున్నవారు సైతం పబ్లిక్‌ సభల్లో అసభ్యంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. 

పార్టీ విధానాల మీదనో, పరిపాలన మీదనో విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగతంగా తిట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలే సభ్యత మర్చిపోయి తిట్టుకుంటున్న నాయకులు కొందరు మరింత దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఉంది. తెలంగాణ కాంగ్రెసు నాయకుడు రేవంత్‌ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు, ఇప్పుడూ కూడా ఫైర్‌బ్రాండే. ప్రత్యర్థులపై మాటలను తూటాలుగా విసరడంలో ఘటికుడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద అప్పుడూ ఇప్పుడూ ఒంటికాలి మీద లేచి విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకుల్లో రేవంత్‌ మొదటి వరుసలో ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అధికారపక్షం నాయకులు, మంత్రులు నోరెత్తకుండా విమర్శలు చేయగలడు. 

రేవంత్‌ టీడీపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెసులో ఉన్నా యువతలో ఫాలోయింగ్‌ చాలావుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాడు. ఇంతటి స్టామినా ఉన్న రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌ గురించి దిగజారుడు వ్యాఖ్యలు అంటే చీప్‌ కామెంట్స్‌ చేయడం సమంజసంగా లేదు.

ఆయన అభిమానులు సైతం ఈ వ్యాఖ్యలను నిరసించి తీరాల్సిందే. ఇంతకూ రేవంత్‌ ఏమన్నాడు? ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్‌ తండ్రి కేసీఆర్‌ను చంపినా చంపొచ్చని అర్థమొచ్చేలా మాట్లాడాడు. మరోవిధంగా చెప్పాలంటే నేరుగానే అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఆయనకు రక్షణ కల్పించాలన్నాడు. 

సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు? మావోయిస్టుల వల్లనో, మరే ఇతర తీవ్రవాదుల వల్లనో ముప్పు ఉందనుకుంటారు కదా. కాని కొడుకు కేటీఆర్‌ వల్లనే ముప్పుందట…!  ''కేటీఆర్‌ను సీఎం చేయకపోతే అర్థరాత్రి లేచి తండ్రిని మెత్త (దిండు) పెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు'' అని వ్యాఖ్యానించాడు. అంటే కొడుకు తండ్రి ప్రాణాలు తీస్తాడనే అర్థం కదా.

సీనియర్‌ నేత రేవంత్‌ ఇలా మాట్లాడొచ్చా? కేటీఆర్‌ను విమర్శించాలనుకుంటే సవాలక్ష అంశాలున్నాయి. కేసీఆర్‌కు కొడుకు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే లక్ష్యం ఉండొచ్చు. ఇది ఎవరికీ తెలియనిది కాదు, కేసీఆర్‌కు అలాంటి లక్ష్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు. పదవి కోసం కేటీఆర్‌ అకృత్యానికి పాల్పడాల్సిన అవసరం లేదు. ఇదేమీ పూర్వపు రాజుల పాలన కాదు. రాజకీయ నాయకులు నోటిని ఎందుకు అదుపులో పెట్టుకోలేరో ఎవరికీ అర్థం కాదు.

చంద్రబాబూ నీకు ఎవడిచ్చాడు హక్కు