మహారాష్ట్రలో మంత్రి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. శాఖల కేటాయింపు పంచాయితీ తేలింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకు గానీ అక్కడ కేబినెట్ ఏర్పడని సంగతి తెలిసిందే. ఇటీలే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పుడు శాఖల కేటాయింపు పూర్తి అయ్యింది. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత కూడా ఆ ఊహాగానాలు కొనసాగాయి. చివరకు అవే నిజం అయ్యాయి.
కేబినెట్లో అత్యధిక పదవులు పొందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాఖల్లో కూడా సింహభాగాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్, శివసేనల కన్నా ఎన్సీపీ అధిక సంఖ్యలో పదవులు పొందిన సంగతి తెలిసిందే. శాఖల విషయంలో కూడా ఆ పార్టీనే కీలక శాఖలను సొంతం చేసుకుంది. హోంమంత్రిత్వ, ఆర్థిక శాఖ మంత్రి పదవులను ఎన్సీపీ సొంతం చేసుకుంది. డిప్యూటీ సీఎం హోదాను పొందిన ఎన్సీపీ నేత అజిత్ పవార్.. ఆర్థిక శాఖను పొందారు. ఇక ముఖ్యమంత్రి పదవిని పొందిన శివసేన కీలకమైన శాఖలను మాత్రం పొందలేకపోయింది.
శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పర్యాటక శాఖను పొందారు. మరో కీలక శాఖ రెవెన్యూను కాంగ్రెస్ పార్టీ పొందింది. ఇలా మంత్రి వర్గం విషయంలో మహారాష్ట్ర వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అయితే అసంతృప్తులు కూడా అప్పుడే బయటపడుతూ ఉన్నారు.
మంత్రి పదవుల విషయంలో ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి అసంతృప్త వాదులు బయటపడుతూ ఉన్నారు. కొందరైతే రాజీనామా హెచ్చరికలు మొదలుపెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా అయినా నడక మొదలుపెట్టగా…. అప్పుడే అసంతృప్త వాదులు వార్తల్లోకి ఎక్కుతూ ఉండటం గమనార్హం!