ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం స్థానిక, పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షాలు టీడీపీ, వామపక్షాలు, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. తిరుపతి, ఒంగోలు, కడప తదితర ప్రాంతాల్లో గొడవలు, దాడులు జరిగాయి. కొన్ని చోట్ల యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. వీటిని అడ్డుకోడానికి టీడీపీ, వామపక్షాలు, బీజేపీ అడ్డుకున్న ఉదంతాలున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రేక్షకపాత్ర పోషించిన పార్టీ ఏదైనా వుందా? అంటే… అది జనసేన మాత్రమే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని, అక్రమాలను అడ్డుకోడానికే తన పార్టీ పుట్టిందని పవన్‌కల్యాణ్‌తో సహా ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో అసలు జనసేన పార్టీ నేతలు ఎక్కడా కనిపించలేదు.
కనీసం ఓట్లు వేయడానికి కూడా వచ్చారా? లేదా? అనేది కూడా అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే జనసేనాని పవన్‌కల్యాణ్ పిలుపు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కనీసం తన మిత్రపక్షమైన బీజేపీకి కూడా జనసేన మద్దతు ప్రకటించలేదు. విద్యావంతులు, మేధావులకు సంబంధించిన ఈ ఎన్నికల్లో జనసేన పాత్ర ఏమీ లేకపోవడం, ఆ పార్టీ నిష్క్రియకు పరాకాష్ట అనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
జనసేన పదో వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న తరుణంలో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు ఎలాంటి పాత్ర లేకపోవడం పవన్ దివాళాకోరు ఆలోచనలను ప్రతిబింబిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి పవన్‌కు ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడొస్తుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎన్నికలంటే పవన్‌కు భయమనే వాస్తవాన్ని…తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు.