ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం పెద్దోళ్ల మనస్తత్వం అనే అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి వ్యక్తిగత జీవిత వివరాలు చివరి వరకు అలా దాస్తూ …ఫైనల్‌గా రెండు ముక్కల్లో అవును , ఆ ప్రచారం నిజమే అని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఎన్ని చూడలేదు.
ఇలాంటిదే ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య అవంతిక మాలిక్ మధ్య సంబంధాలపై రకరకాల ప్రచారం జరుగుతోంది. వాళ్లిద్దరూ విడిపోయినట్టు చాలా కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ …ఖండించడం లాంటివేవీ జరగలేదు. తాజాగా అవంతిక మాలిక్ తల్లి చేసిన ఓ పోస్టు విడాకులకు సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
ప్రస్తుతం ఇమ్రాన్ వయసు 35 ఏళ్లు. ఎనిమిదేళ్ల క్రితం అవంతికను అతను పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిగా వాళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అవంతిక తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. ఇమ్రాన్ మాత్రం ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇటీవల అవంతిక మాలిక్ తన కుమార్తె పుట్టినరోజు జరిపారు. అయితే కూతురి పుట్టిన రోజుకు ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. దీంతో వాళ్లిద్దరూ విడిపోయారనే వాదనకు మరింత బలం చేకూర్చింది.
కూతురి విడాకుల విషయమై అవంతిక తల్లి స్పందించారు. విడాకుల గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు. అలాంటిది ఉంటే ఖచ్చితంగా చెబుతామన్నారు. కానీ తన అల్లుడితో కూతురికి విభేదాలున్నాయని స్పష్టత ఇచ్చారు. ఎప్పటికైనా ఆ విభేదాలు సమసిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన ఓ పోస్టు విడాకులకు ఆలోచింపజేసేలా ఉంది. డెవాన్ బ్రో అనే రచయిత కవిత్వాన్ని రీపోస్టు చేస్తూ ట్రూత్ బాంబ్ అని ఆమె పేర్కొనడం గమనార్హం. ఇంతకూ ఆ కవితలో ముఖ్యమైన వాక్యాలను తెలుసుకుందాం పదండి.
‘వివాహం అనే బంధం కష్టం, విడాకులు తీసుకోవడమూ కష్టమే.. ఏది కావాలో ఎంచుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఎల్లప్పుడూ కఠినంగా ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. తెలివిగా ఆలోచించండి’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ కవిత్వంలోని పరమార్థాన్ని తెలుసుకుంటే …ఇమ్రాన్ దంపతుల విడాకులపై క్లారిటీ వచ్చినట్టే.