ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారం నూతన గవర్నర్ ఎస్.అబ్దుల్నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే విషయమై చర్చిస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొత్తం 9 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చనట్టు తెలిసింది. రాష్ట్రంలో వివిధ ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఈ సమయం సరిపోదని ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరం చెప్పే అవకాశం వుంది. దానికి ప్రభుత్వ సమాధానం ఎలాంటి సమాధానం చెబుతుంటే చూడాలి.
జగన్ ప్రభుత్వానికి ఇది చివరి పూర్తిస్థాయి బడ్జెట్. ఎందుకంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ మాత్రమే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు వేటికి ఎక్కువ వుంటాయనేది ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుత సమావేశాల్లో పలు కీలక బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. మరీ ముఖ్యంగా రాజధాని అంశంపై ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఏదైనా వుందా? అనే చర్చ లేకపోలేదు. కానీ సుప్రీంకోర్టులో రాజధానిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో దాని జోలికి వెళ్లే అవకాశం లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.