తెలుగుదేశం పార్టీని మహానుభావుడు ఎన్టీయార్ స్థాపించారు. ఆయన అప్పటికే వెండితెర వేలుపుగా వర్ధిల్లుతున్నారు. దేవాంశ సంభూతునిగా జనం కొలిచిన అన్న గారిని ప్రత్యక్షంగా చూసి తరించిన జనాలు ఆయనే తమ ఏలిక అని ఆరాధించి మరీ అందలం ఎక్కించారు. ఎన్టీయార్ తరువాత టీడీపీ నారా చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది.
ఆయన నాయకత్వంలో అయిదు సార్లు ఎన్నికలకు వెళ్తే రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా పొత్తులతో మాత్రమే. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కింజరాపు అచ్చెన్నాయుడుని తెచ్చి పెట్టారు.
ఆయన బీసీల నేతగా ఉన్నారు. ఇపుడు ఆయన మీదనే టీడీపీ పెద్ద ఆశలు పెట్టుకుందని మొత్తం క్యాడర్ కి కూడా అర్ధమైన తరువాత స్తోత్ర పాఠాలు అన్నీ అచ్చెన్నకే చేస్తున్నారు. ఆయనే టీడీపీని గట్టెక్కించాలని కోరుకుంటున్నారు.
చంద్రబాబుని మరోసారి సీఎం ని చేయాల్సిన బాధ్యత అచ్చెన్నదేనని కూడా తమ్ముళ్ళు గట్టిగా అంటున్నారు. అంటే టీడీపీలో వారసుల పస తగ్గిందా. లేక వేరే ఎవరూ లేరా అన్న డౌట్లు కూడా ఈ సందర్భంగా వస్తున్నాయి.
ఏది ఏమైనా అచ్చెన్న మీదనే టీడీపీ అధినాయకత్వం సైతం భారం వేశాక క్యాడర్ కి కూడా ఆయనే పెద్ద దిక్కుగా కనిపించడంలో వింతా విచిత్రమూ లేదు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఆరవ వేలు అని అంటారు కానీ అచ్చెన్న లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు సారధిగా ఉంటే ఆయనే అసలైన వేలుగా మారినా ఆశ్చర్యం లేదు.
ఇక ఎలా చూసుకున్నా ఇపుడు టీడీపీకి బలమూ, వరమూ అచ్చెన్నాయుడే. ఆయన వైపు మెల్లగా క్యాడర్ ర్యాలీ అయితే హై కమాండ్ చూస్తూ తట్టుకోగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న. దున్నే వాడిదే భూమి అంటారు, బలమున్నవాడిదే రాజ్యం అని కూడా చెబుతారు. మరి టీడీపీని తన భుజాల మీద మోసేందుకు సిద్ధపడుతున్న అచ్చెన్నకు తగిన ప్రతిఫలం కూడా దక్కాలిగా.